పార్కుల టెండర్ల జాప్యంతో కార్మికుల ఉపాధికి ముప్పు….
ఆర్‌జీ-2 ఏరియా పార్కుల టెండర్లను వెంటనే నిర్వహించాలని పర్యావరణ విభాగం మహాప్రబంధకునికి వినతిపత్రం….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని,
సింగరేణి ఆర్‌జీ-2 ఏరియాలోని పార్కుల నిర్వహణకు సంబంధించిన టెండర్లను తక్షణమే నిర్వహించాలని కోరుతూ సింగరేణి బొగ్గుగని ఒప్పంద కార్మికుల సంఘం ఆధ్వర్యంలో పర్యావరణ విభాగం మహాప్రబంధకునికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకుడు ఏ. వెంకన్న మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పార్కుల నిర్వహణ కోసం టెండర్లు నిర్వహించినప్పటికీ కొందరు కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ప్రక్రియ నిలిచిపోయిందన్నారు. దీనివల్ల పార్కుల్లో పనిచేస్తున్న సుమారు 30 మంది ఒప్పంద కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అధికారుల సమన్వయ లోపం వల్ల సమస్య మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ నిలిచిపోవడంతో పార్కుల నిర్వహణ దెబ్బతింటోందని, ఎండాకాలంలో మొక్కలు, చెట్లు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన పార్కులు నిర్లక్ష్యం కారణంగా నష్టపోయే పరిస్థితి నెలకొందని తెలిపారు.
న్యాయస్థానంలో కేసు తుది తీర్పు వచ్చే వరకు తోటమాలి కార్మికులకు ప్రతిరోజూ పని కల్పించే విధంగా తాత్కాలిక ప్రాతిపదికన టెండర్లు నిర్వహించి ఉపాధి కల్పించాలని కోరారు. తద్వారా కార్మికులకు న్యాయం చేయడంతో పాటు పార్కుల సంరక్షణ కూడా కొనసాగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. అశోక్, రాష్ట్ర నాయకుడు ఎన్. సంజీవ్, తోటమాలి కార్మికులు ఎం. దుర్గయ్య, డి. బుచ్చమ్మ, ఎం. కవిత, టి. రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

