శాస్త్రీయ దర్యాప్తుతోనే నేరాల ఛేదన వేగవంతం…

Sakshitha news

శాస్త్రీయ దర్యాప్తుతోనే నేరాల ఛేదన వేగవంతం…

పోలీసుల నైపుణ్యాల పెంపే డ్యూటీ మీట్ లక్ష్యం….

— సీపీ అంబర్ కిశోర్ ఝా…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: రామగుండం,
నేరాల దర్యాప్తును శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా పోలీసు అధికారులకు సూచించారు.

రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో నిర్వహించిన కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల, కొమురంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలకు చెందిన పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, డ్యూటీ మీట్ అనేది కేవలం అవార్డులు, రివార్డులు పొందేందుకు నిర్వహించే కార్యక్రమం కాదని, పోలీసు సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరుచుకుని రోజువారీ విధుల్లో స్వీయ సమీక్ష చేసుకునేందుకు ఇది ఉత్తమ వేదిక అని అన్నారు.

పోటీల్లో గెలుపు, ఓటమి కంటే పాల్గొనే ప్రతి అధికారికి లభించే అనుభవమే ముఖ్యమని, డ్యూటీ మీట్‌లో నేర్చుకున్న అంశాలను విధుల్లో అమలు చేస్తే పనితీరు మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో నేరాల దర్యాప్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు అవసరమైన మెళకువలను ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.

శాస్త్రీయ దర్యాప్తు, వేలిముద్రల విశ్లేషణ, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, కేసుల దర్యాప్తులో అనుసరించాల్సిన విధానాలపై సమగ్ర అవగాహన పెంపొందించుకోవడానికి డ్యూటీ మీట్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. అలాగే క్లిష్టమైన కేసుల పరిష్కారంలో అధికారులు తమ అనుభవాలు, ఆలోచనలను పరస్పరం పంచుకోవడానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ డ్యూటీ మీట్‌లో ప్రతిభ కనబరిచిన అధికారులు కాళేశ్వరం జోన్ తరఫున హైదరాబాద్‌లోని మల్కాజిగిరిలో జరిగే రాష్ట్రస్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌లో పాల్గొంటారని సీపీ వెల్లడించారు.

ఈ సందర్భంగా శాస్త్రీయ దర్యాప్తు, వాహనాలు మరియు ప్రాంగణాల తనిఖీ, కంప్యూటర్ పరిజ్ఞానం, శునక దళం సామర్థ్యాలకు సంబంధించిన నాలుగు విభాగాల్లో రాత, ప్రాయోగిక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్, ప్రత్యేక శాఖ ఏసీపీ నాగేంద్ర గౌడ్, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, సీసీఎస్ ఇన్‌స్పెక్టర్లు గోపి, బాబూరావు, సీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వర్ రావు, సమాచార సాంకేతిక విభాగం ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు దామోదర్, శేఖర్, మల్లేశం, పెద్దన్న, రమేష్‌తో పాటు కాళేశ్వరం జోన్ పరిధిలోని వివిధ జిల్లాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top