మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, పోలిరెడ్డిపాలెంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మేజిస్ట్రేట్ వారి ఆదేశాల మేరకు చిలకలూరిపేట పట్టణంలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల, పోలిరెడ్డిపాలెంలో రాజ్యాంగ ఆమోద దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం రాజ్యాంగ పీఠిక, ప్రాథమిక విధులు గల పోస్టర్లను ఆవిష్కరించారు. విద్యార్థినీ విద్యార్థులతో భారత రాజ్యాంగ పీఠికను ప్రతిజ్ఞగా చదివించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె. హైమావతి మాట్లాడుతూ, రాజ్యాంగంలోని ఆశయాలు, విలువలను ప్రతి ఒక్కరూ జీవితాంతం పాటించాలని, ప్రాథమిక విధులను అవగాహన చేసుకొని క్రమశిక్షణతో అమలు చేయాలని సూచించారు. రాజ్యాంగ పరిషత్ ద్వారా 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగం ఆమోదించబడిందని ఆమె గుర్తు చేశారు.
అనంతరం ‘భారత సంవిధాన్’ యాప్‌లో విద్యార్థులు, ఉపాధ్యాయులు వ్యక్తిగతంగా పీఠిక పఠనం చేసి సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. అలాగే అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో రాష్ట్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిన ‘మాక్ అసెంబ్లీ’ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న దృశ్యాలను విద్యార్థులకు చూపించి మాక్ అసెంబ్లీ విధానంపై అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. శైలజ, పోటు శ్రీనివాసరావు, జి. ఆదిలక్ష్మి, కె. అరుణ, సి.హెచ్. నవ్యశ్రీలతో పాటు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
