ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరతపై ఆందోళన…
పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు…
— డా. మార్షల్ దుర్గం నగేష్…
సాక్షిత .పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:గోదావరిఖని,
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న మందుల కొరత పేద రోగుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతోందని సమతా సైనిక దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా.మార్షల్ దుర్గం నగేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేదలకు భరోసా కల్పించే కేంద్రాలుగా ఉండాల్సిందిపోయి, అవసరమైన మందులు అందక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు.
ఆసుపత్రిలో వైద్యులు రాసే మందుల్లో కొన్నింటిని మాత్రమే కౌంటర్‌లో అందజేస్తుండగా, మిగిలిన అత్యవసర మందులను రోగులు ప్రైవేట్ మెడికల్ షాపుల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొందని ఆరోపించారు. దీంతో ఉచిత వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే వారిలో ఎక్కువ మంది తెల్ల రేషన్ కార్డు కలిగిన నిరుపేదలేనని గుర్తు చేసిన ఆయన, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ప్రతి నెలా వేల రూపాయలు వెచ్చించి మందులు కొనుగోలు చేయడం సాధ్యం కాదన్నారు.డబ్బుల కొరత కారణంగా మందులు వాడడం ఆపేస్తే రోగుల ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు సూచించే అన్ని రకాల మందులు ఉచితంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించి మందుల కొరతకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు.
లేనిపక్షంలో సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో బాధిత రోగుల తరఫున పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని డా.మార్షల్ దుర్గం నగేష్ హెచ్చరించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
