ఓటు హక్కు పరిరక్షణ కోసం బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి…
ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే కుట్రలను తిప్పికొట్టాలి: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: ఆదిలాబాద్,
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి విచ్చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్‌గా జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన పార్టీ శ్రేణులతో ఆత్మీయంగా సమావేశమై బీఎల్‌ఏ-2 సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, దేశంలో ఎన్నికల వ్యవస్థను బలహీనపరిచేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ఎస్‌ఐఆర్ పేరుతో ఓట్లను భారీగా తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో కూడా ఇలాంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.
దేశంలో ఓటు చోరీ అంశంపై రాహుల్ గాంధీ ముందుగానే హెచ్చరించారని, ప్రస్తుతం అదే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటు హక్కును హరించే కుట్రలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కు పరిరక్షణలో బీఎల్‌ఏలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.
దేశంలో నీట్ పరీక్షల నిర్వహణపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలపై స్పందిస్తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. యువతను రెచ్చగొట్టి కేసుల్లో ఇరికించే రాజకీయాలు మంచివి కావని, యువత అభివృద్ధి, ఉపాధి, విద్యపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
బీఎల్‌ఏ-2 సమావేశంలో ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటు, ప్రజా సమస్యలపై స్పందన, రాబోయే రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

