చెత్త నిర్వహణపై మైకులతో అవగాహన
** మున్సిపల్ కమిషనర్ మౌర్య సూచన
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: తడి, పొడి చెత్త వేరుచేసి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు, నగరపాలక సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై ప్రజలకు చెత్త తరలించే వాహనాల్లో మైకుల ద్వారా అవగాహన కల్పించాలని కమిషనర్ నారపురెడ్డి మౌర్య అధికారులకు సూచించారు. నగరంలోని 30, 31 వార్డులకు చెందిన పరదాల వీధి, రామచంద్ర పుష్కరిణీ, జ్యోతి థియేటర్ కూడలి, నెహ్రూ నగర్, కావమ్మ గుడి వీధి, ఐఎస్ మహల్, ఉర్దూ స్కూల్ వీధి, బ్రహ్మంగారి గుడి తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను కార్పొరేటర్ కల్పన, అధికారులతో కలసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నగరంలో ప్రతి వీధికి చెత్త సేకరణకు వెళ్ళే వాహనాల్లో మైకుల ద్వారా చెత్త వేరుచేసి ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలు ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని అన్నారు. డ్రైనేజీ కాలువల్లో పేరుకు పోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని కోరారు. నైట్ షెల్టర్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కుప్పలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలని సిబ్బందిని ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ గోమతి, తేజస్విని, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, డి.ఈ.లు మధు, శిల్ప, సర్వేయర్ కోటేశ్వర రావు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య తదితరులు ఉన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
