కళాకారులు చరిత్ర, సంస్కృతి-సాంప్రదాయాలను ముందు తరాలకు అందించే వారధులు….

Sakshitha news

కళాకారులు చరిత్ర, సంస్కృతి-సాంప్రదాయాలను ముందు తరాలకు అందించే వారధులు….

జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్…

సాక్షిత పెద్దపల్లి//గోదావరిఖని కళాకారులు చరిత్ర, సంస్కృతి-సాంప్రదాయాలను ముందు తరాలకు అందించే వారధులని జాతీయ ఎస్సీ కమీషన్ సభ్యులు వడ్డేపల్లి రాంచందర్, రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. తారా ఆర్ట్స్ అకాడెమీ ఆధ్వర్యంలో.. ఆదివారం రాత్రి స్థానిక మార్కండేయ కాలనీలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఉగాది కళోత్సవాలకు ముఖ్య అతిథులుగా హాజరై విభిన్న రంగాలలో విశేష సేవలందిస్తున్న ఎంపిక చేయబడిన ప్రతిభావంతులకు ఉగాది, నల్లవజ్రం పురస్కారాలను అందజేశారు.

ఈ సందర్భంగా వడ్డేపల్లి రాంచందర్ మాట్లాడుతూ కళలు, సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షిస్తాయని అన్నారు. మన ప్రాంతంలో కళాకారులకు కొదవలేదని, పలు కళలలో నిష్ణాతులైన జాతీయ, అంతర్జాతీయ స్థాయి కళాకారులు మన పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నారన్నారు. శాస్త్రీయ సంగీతం, నృత్యాలు సంస్కారవంతంగా ఉంటాయని, వాటిపట్ల ఆసక్తి కలిగేలా కళాకారులను, పిల్లలను ప్రోత్సహించాలన్నారు.

మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిర్వహించిన తెలంగాణ ఉద్యమంలో ప్రజలను చైతన్య పరచి, ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో కళాకారుల ఆట, పాట, మాట కీలక భూమిక పోషించాయన్నారు. ఈ ప్రాంతంలో కళాకారులకు కొదవలేదని, వారి ప్రదర్శనలకు వేదికలేక దాదాపు ఇరవై, ఇరవై ఐదు సంవత్సరాలుగా కళాకారులు ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్ ను ఆశ్రయిస్తూ

ఇబ్బందులు పడుతున్నారన్నారు. 2004లో నాటి మున్సిపల్ చైర్మన్ దివంగత బడికెల రాజలింగం హయాంలో కళాభవన్ నిర్మాణానికి బీజం పడినప్పటికీ, అది నేటికీ పూర్తి కాలేదన్నారు. ఈ ప్రాంతంలో కళాభవన్ నిర్మించాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సంకల్పంతో రెండు సంవత్సరాలలో అధునాతన కళాభవన్ ను నిర్మించి, కళాకారులకు అందుబాటులోకి తీసుకు వస్తామన్నారు. అందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్ వచ్చాయన్నారు. ఖాళీ అవుతున్న రామగుండం, గోదావరిఖని నగరాలకు పూర్వ వైభవం తీసుకురావడానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కృషి చేస్తున్నారని, 800 మెగావాట్ల కొత్త పవర్ ప్రాజెక్టు కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందన్నారు.

వేలకోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి, రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కు ప్రజలంతా సహకరించాలని కోరారు. పారిశ్రామిక ప్రాంతానికి చుట్టూతా ఉన్న పరిశ్రమలతో నగరం కాలుష్యమయంగా మారుతోందని, ఆ కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛ రామగుండంగా మార్చడం కోసం మొక్కలు నాటాలన్నారు. మన ఇల్లును శుభ్రంగా ఉంచుకున్నట్లు నగరాన్ని కూడా స్వచ్ఛంగా ఉంచాలని పిలుపు నిచ్చారు.

ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి, జాతీయ, అంతర్జాతీయ స్థాయికెదిగిన సంకె రాజేష్ మన ప్రాంతంలో విభిన్న రంగాలలో రాణిస్తున్న ప్రతిభావంతులకు ఉగాది, నల్లవజ్రం పురస్కారాలు ప్రదానం చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు.

సంస్థ అధ్యక్షులు సంకె రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమీషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్, డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు దాసరి సాంబమూర్తి, చక్రపాణి, ఏఆర్ ఏసీపీ చల్లా ప్రతాప్, సాంస్కృతిక సారథి రాష్ట్ర సలహా మండలి సభ్యులు అంతడ్పుల నాగరాజు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ డొంకన రవి, ఎన్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్, సినీ నిర్మాత, దర్శకులు నరేష్ వర్మ, ఆర్జీ వన్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి, నిర్వహణ కమిటీ సభ్యులు కవ్వంపల్లి స్వామి, దామెర శంకర్, మేజిక్ రాజా, దయా నర్సింగ్, చంద్రపాల్, చీకటి అంజయ్య, గజెల్లి రాజలింగు, పెద్దుల్ల శ్రీనివాస్, తూము నర్సయ్య, పలు జిల్లాలకు చెందిన పురస్కార, అవార్డు గ్రహీతలు పాల్గొనగా, కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.

Scroll to Top