ఆన్ లైన్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
** రూ 7.48 లక్షల నగదు, ల్యాప్ టాప్ స్వాధీనం
సాక్షిత ప్రతినిధి – తిరుపతి: జిల్లాలో ఆన్ లైన్ బెట్టింగ్ కార్యకలా పాలపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని, ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు ఇదివరకే కఠినమైన ఆదేశాలు జారిచేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి పట్టణం బైరాగిపట్టెడ పద్మావతి పార్క్ సమీపంలో ఆన్లైన్ క్యాసినో, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసి, వారి వద్ద నుండి రూ.7,48,000 నగదు, ఒక ల్యాప్‌టాప్, 04 మొబైల్ ఫోన్లు, 04 పేటీయం క్యూఆర్ కోడ్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, డీఎస్పీ ఎం.భక్తవత్సలం పర్యవేక్షణలో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసులు, ఎస్‌ఐలు ఓ.రామస్వామి, జి.ప్రసాద్, క్రైమ్ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టి ముద్దాయిలను అరెస్టు చేశారు. నిందితులు ఎస్ విన్.ఎక్స్చేంజి, కింగ్ ఎక్స్చేంజి వంటి యాప్‌ల ద్వారా అమాయక ప్రజలను ఆకర్షించి క్యాసినో, క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ కమిషన్ రూపంలో అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. గత సంవత్సరం నుండి ఈ కార్యకలాపాలు కొనసాగిస్తూ అనేక మంది ప్రజలు లక్షల రూపాయలు నష్టపోయినట్లు తెలిసింది. పరారీలో ఉన్న మరికొంతమంది నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా పోలీసులు హెచ్చరిస్తూ ఆన్లైన్ బెట్టింగ్ యువత భవిష్యత్తును దెబ్బతీసే ప్రమాదకర అలవాటు అని పేర్కొంటూ ప్రజలు, ముఖ్యంగా యువత, క్రింది జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు:
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
యాప్‌లు లేదా వెబ్‌సైట్లలో బెట్టింగ్, గేమింగ్ పేరుతో డబ్బులు పెట్టవద్దు ఇది పూర్తిగా మోసం.
సోషల్ మీడియా, వాట్సాప్ ద్వారా వచ్చే “ఈజీ మనీ” లేదా “గుర్తింపు లేని బెట్టింగ్ లింకులు”ను నమ్మవద్దు.
క్యూఆర్ కోడ్‌లు లేదా వ్యక్తిగత అకౌంట్‌లకు బెట్టింగ్ కోసం డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయవద్దు.
ఆన్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
తల్లిదండ్రులు తమ పిల్లల మొబైల్ వినియోగాన్ని పర్యవేక్షిస్తూ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి.
ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహించే వారు మాత్రమే కాకుండా, అందులో పాల్గొనే వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా పోలీస్ శాఖ హెచ్చరించింది.

