టీటీడీ కాలేజీల్లో అన్ని వసతులు ఉండాల్సిందే

Sakshitha news

టీటీడీ కాలేజీల్లో అన్ని వసతులు ఉండాల్సిందే

** మహిళా కళాశాల తనిఖీలో టీటీడీ ఛైర్మన్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: టీటీడీకి చెందిన కాలేజీల్లో విద్యార్థులు, లెక్చరర్లకు కావాల్సిన మౌలిక సౌకర్యాలన్నీ ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టాలని టీటీడీ చైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు అధికారులకు సూచించారు. బుధవారం ఆయన టీటీడీకి చెందిన ఎస్పీడబ్ల్యూ మహిళా జూనియర్ కళాశాలను తనిఖీ చేశారు. కాలేజీలో అత్యవసరమైన పనులను సకాలంలో పూర్తి చేయాలని ఛైర్మెన్ బీఆర్ నాయుడు ఆదేశించారు. మహిళా జూనియర్ కళాశాల జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ బోర్డు సభ్యులు గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డిలతో సమీక్షించి అభివృద్ధి వేగిరం చేయాలన్నారు. మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థినుల సమస్యలు తన దృష్టికి వచ్చాయని, విద్యార్థినుల ప్రాథమిక అవసరాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

కళాశాలలోని సమస్యలను జేఈవో, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ తన దృష్టికి తీసుకువచ్చారని, వాటి అన్నింటిపై నివేదిక తయారు చేయాలని చైర్మన్ అధికారులను కోరారు. విద్యార్థినులు చదువుకునేం దుకు కళాశాల పరిసరాలు చాలా బాగున్నాయన్నారు. అదేవిధంగా ఈ కళాశాలలో ఉత్తీర్ణత శాతం చాలా అద్భుతంగా ఉందని అభినందించారు. ముఖ్యంగా కళాశాలలో విద్యార్థినులకు హాస్టల్ సామర్థ్యాన్ని, వసతి సౌకర్యాన్ని పెంచాలని, వైద్య సౌకర్యాల పెంపు, వేడి నీటి కోసం సోలార్ వాటర్ హీటర్స్, ఈ – లెర్నింగ్ సెమినార్ హాల్ ఏర్పాటు, హాస్టల్ లో మరమ్మతులు, ఫిజికల్ ఎడ్యూకేషన్ సౌకర్యం తదితర అంశాలపై అధికారులు నివేదిక తయారు చేసి కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులకు ఛైర్మన్ సూచించారు. తనిఖీల్లో భాగంగా ఛైర్మెన్ బీఆర్ నాయుడు అధికారులతో కలిసి కాలేజీ పరిసరాలను, వంట గది, హాస్టల్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వెంట టిటిడి డిఈవో వెంకట సునీల్, ప్రిన్సిపాల్ డా.సి.భువనేశ్వరి, ఎస్.ఈ మనోహరం తదితర అధికారులు పాల్గొన్నారు.