ప్రభుత్వ విద్యార్థులకు ఏఐ – రోబోటిక్స్ శిక్షణ

Sakshitha news

ప్రభుత్వ విద్యార్థులకు ఏఐ – రోబోటిక్స్ శిక్షణ…

భవిష్యత్ సాంకేతిక రంగాలకు సిద్ధం చేస్తున్న పెద్దపల్లి జిల్లా…..

–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దపల్లి,
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), రోబోటిక్స్, డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధికి నిర్వహించిన “సూపర్ సమ్మర్ కంప్యూటర్, ఏఐ & రోబోటిక్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్” విశేష ఫలితాలను అందించిందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

టి-ఫైబర్ సహకారంతో ఏప్రిల్ 27 నుంచి మే 26 వరకు నెల రోజులపాటు మంథని, పెద్దపల్లి, రామగుండం, సుల్తానాబాద్ కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించగా, మొత్తం 312 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొని ఆధునిక సాంకేతిక అంశాల్లో శిక్షణ పొందినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి కేంద్రంలో ఆరు రోజుల పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ నైపుణ్యాలపై ప్రత్యేక తరగతులు నిర్వహించినట్లు తెలిపారు.

కార్యక్రమం ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన “పెద్దపల్లి జిల్లా ఏఐ & రోబోటిక్స్ స్టూడెంట్ షోకేస్ – 2026”లో విద్యార్థులు ప్రదర్శించిన ప్రతిభను కలెక్టర్ అభినందించారు. జిల్లాలోని నాలుగు ప్రాంతాల నుంచి ఎంపికైన విద్యార్థులు రూపొందించిన రోబోటిక్స్ నమూనాలు, ఏఐ ఆధారిత వినూత్న ప్రాజెక్టులు, డిజిటల్ ప్రజెంటేషన్లు అందరినీ ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు.

సాంకేతికత ఆధారిత ప్రపంచంలో పోటీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కూడా ఆధునిక విద్యలో ముందుండాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సృజనాత్మకత, సమస్యల పరిష్కార నైపుణ్యం, సాంకేతిక అవగాహన పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకుని భవిష్యత్తులో ఏఐ, రోబోటిక్స్, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్టిఫికెట్లు, జ్ఞాపికలు అందజేసి సత్కరించారు.

కార్యక్రమంలో జిల్లా పరిపాలన అధికారులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, పలువురు ఆహ్వానిత అతిథులు పాల్గొన్నారు.

Scroll to Top