పనిప్రదేశాల్లో మహిళల రక్షణే ధ్యేయం: అడిషనల్ కలెక్టర్ కే. సీతారామారావు
సాక్షిత సూర్యాపేట :
పనిచేసే ప్రదేశాల్లో మహిళలకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించడం ప్రతి సంస్థ బాధ్యత అని అడిషనల్ కలెక్టర్ కే. సీతారామారావు అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ, నిషేధం మరియు పరిష్కార చట్టం (POSH Act–2013)పై అవగాహన, శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేస్తున్న మహిళలు తమ హక్కులు, చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
10 మందికి పైగా సిబ్బంది ఉన్న ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC) ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏవైనా వేధింపులు ఎదురైతే మహిళలు నిర్భయంగా ఫిర్యాదు చేయాలని కోరారు. 2013 చట్టం ప్రకారం వేధింపులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని, పని ప్రదేశాల్లో మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశమని వివరించారు. అనంతరం POSH చట్టం కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఈవో శిరీష మాట్లాడుతూ, మహిళా ఉద్యోగుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని తెలిపారు. మహిళలను తక్కువగా చూడటం, సైగలు చేయటం, అసభ్యంగా తాకటం, సెల్‌ఫోన్‌లో అసభ్య సందేశాలు పంపటం వంటి చర్యలు చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి సందర్భాల్లో బాధితులు మానసికంగా కుమిలిపోకుండా ధైర్యంగా కమిటీ ముందుకు వచ్చి ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులను రహస్యంగా దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ అధికారి నరసింహారావు, కమిటీ సభ్యులు దయానంద రాణి, శంకర్ నాయక్, జిల్లా ట్రెజరీ అధికారి రవికుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి సుదర్శన్‌రెడ్డి, టీఎన్జీవోస్ జనరల్ సెక్రటరీ దున్న శ్యామ్, కార్యాలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
