ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై చర్యలు తీసుకోవాలి
విద్య హక్కు చట్టం ప్రకారం 25% శాతం ఉచిత ప్రవేశాలు అమలు చేయాలి
డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎలుగు మధు డిమాండ్
సాక్షిత మోతె : ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు పుస్తకాలు, యూనిఫారాలు, ప్రత్యేక కోచింగ్‌ల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతున్నాయని డివైఎఫ్ఐ మండల కార్యదర్శి ఎలుగు మధు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యను వ్యాపారంగా మార్చి ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేయడం వల్ల మధ్యతరగతి, పేద కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. పుస్తకాలు, యూనిఫారాలు, రవాణా, కోచింగ్ తదితర అంశాల పేరుతో అదనపు వసూళ్లు చేస్తున్న పాఠశాలలపై ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా విద్య హక్కు చట్టం (RTE) ప్రకారం ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లను పేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు ఉచితంగా కేటాయించే నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని కోరారు.
ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన అర్హులైన విద్యార్థులకు ఉచిత విద్య అందేలా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువచ్చి ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించాలని, తల్లిదండ్రులపై ఆర్థిక భారం తగ్గించే చర్యలు చేపట్టాలని ఎలుగు మధు డిమాండ్ చేశారు. విద్య ప్రతి పిల్లవాడి హక్కు అది వ్యాపార వస్తువుగా మారకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
