జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలి

Sakshitha news

జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ మంజూరు చేయాలి

** నెలకు రూ.20 వేలు పెన్షన్ ఇవ్వాలి

** వెటరన్ జర్నలిస్ట్స్
ఉమ్మడి జిల్లా కార్యవర్గం తీర్మానం

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రాష్ట్రంలో వెటరన్ జర్నలిస్టులందరికీ నిబంధనలు సడలించి, శాశ్వత అక్రిడిటేషన్ మంజూరు చేసేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసికోవాలని ఏపీ వెటరన్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గం నిర్మానించింది. తిరుపతి పిల్లపాలెం గ్రంథాలయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వెటరన్ జర్నలిస్టుల సర్వసభ్య సమావేశం ఎం. నరేందర్ రెడ్డి (రిటైర్డ్ “సాక్షి” సబ్ ఎడిటర్) అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రధాన వక్తగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ టి.జనార్ధన్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలు సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నాయని తెలిపారు. అయితే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా లలో నేటికీ మంజూరు చేయకపోవడం శోచనీయమని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో 65 లక్షల మందికి పైగా ప్రజలకు సామాజిక భద్రత క్రింద నెలవారి 4000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నేపధ్యం లో 300 మంది జర్నలిస్టులకు కేవలం రూ.60 లక్షలు కేటాయించక పోవడం బాధాకరం అన్నారు. ప్రభుత్వం సీనియర్ జర్నలిస్టుల పట్ల ఉదారంగా వ్యవహరించాలని అక్రిడేషన్ మంజూరులో ఉన్న సాంకేతిక సమస్యలు సత్వరం తొలగించి ప్రతి జర్నలిస్టుకు శాశ్వత అక్రిడేషన్ మంజూరు చేయాలని పేర్కొన్నారు. గతంలో లాగా ప్రభుత్వ ప్రకటనల నుంచి జర్నలిస్ట్ వెల్ఫేర్ ఫండ్ కు సెస్ వసూలు చేసి శాశ్వత సంక్షేమనిధిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న వర్కింగ్ జర్నలిస్టు మెడి క్లెయిమ్ ను కనీసం 5 లక్షలకు పెంచాలని ఆయన కోరారు. సీనియర్ జర్నలిస్ట్ జి.శ్రీధర్ మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వెటరన్ జర్నలిస్ట్ ల కోసం శాశ్వత సంక్షేమనిధి ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

నూతన కార్యవర్గం…

అనంతరం సమావేశంలో 9 మందితో నూతన కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకోబడింది. గౌరవ అధ్యక్షులుగా జి శ్రీధర్,
వర్కింగ్ ప్రెసిడెంట్ గా టి.జనార్ధన్, అధ్యక్షులుగా ఎం.నరేందర్ రెడ్డి(రిటైర్డ్ “సాక్షి” సబ్ ఎడిటర్),
ప్రధాన కార్యదర్శిగా కె.చంద్రశేఖర్, కోశాధికారిగా ఎన్.వరదరాజులు,
ఉపాధ్యక్షులు.పి.వి.రవి కుమార్, సహాయ కార్యదర్శి ఎమ్మెస్ రెడ్డి, కార్యవర్గ సభ్యులుగా ఎస్.రమేష్ కుమార్, ఎ.రాఘవ శర్మలు ఎన్నికయ్యారు.

Scroll to Top