సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి జూన్ 13న భారీ పాదయాత్ర – కౌశిక హరి పిలుపు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: గోదావరిఖని సింగరేణి సంస్థలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కార్మికుల మారుపేర్లు (అలియాస్ పేర్లు), విజిలెన్స్ పెండింగ్ కేసులు, మెడికల్ బోర్డు పునఃప్రారంభం వంటి ప్రధాన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 13వ. తేదీన చేపట్టే భారీ పాదయాత్రను జయప్రదం చేయాలని బి.ఆర్.ఎస్ పార్టీ ముఖ్య నాయకుడు, కార్మిక నేత కౌశిక హరి పిలుపునిచ్చారు.
బుధవారం రామగుండం కోల్ బెల్ట్ పరిధిలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మారుపేర్లు, విజిలెన్స్ కేసుల కారణంగా వందలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ఈ న్యాయమైన సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం సాధించేందుకు బి.ఆర్.ఎస్ పార్టీ, అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జూన్ 13న విట్టల్ నగర్ హనుమాన్ టెంపుల్ నుండి ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం వరకు భారీ పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ మారు పేర్లు, విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య తీవ్రత దృష్ట్యా సింగరేణి వ్యాప్తంగా ఉన్న 11 ఏరియాల కోల్ బెల్ట్ ప్రాంతాల బాధితులు, కార్మికులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కౌశిక హరి కోరారు.
“సింగరేణి బొగ్గు గని కార్మికుల హక్కుల సాధన కోసం అన్ని కార్మిక సంఘాల నాయకులు, ప్రతినిధులు, కార్మిక సోదరులంతా ఏకతాటిపైకి రావాలి. మన గళాన్ని బలంగా వినిపించి యాజమాన్యం స్పందించేలా చేయాలి” అని ఆయన పిలుపునిచ్చారు.
ఈ పాత్రికేయుల సమావేశంలో టి.బి.జి.కె.ఎస్ నాయకుడు పర్లపెల్లి రవి, బి.ఆర్.ఎస్ నాయకుడు జె.వి రాజు, లక్క శ్రావణ్ గౌడ్, పున్నం శశికుమార్, కల్వల సాగర్ తదితర కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.
