చారిత్రక చిహ్నం కొండవీటి కోట అభివృద్ధికి స్వదేశ దర్శన్ 2.0 కింద త్వరితగతిన నిధులు మంజూరు చేయాలి
-కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ కు నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు విన్నపం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని చారిత్రక, సంస్కృతి వైభవానికి ప్రతీకగా, పర్యటకానికి అత్యంత వీలుగా ఉన్న కొండవీటి కోట వారసత్వ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వ పథకం స్వదేశ దర్శన్ స్కీమ్ 2.0 కింద త్వరితగతిన నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేపట్టాలని ఢిల్లీలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షకావత్ ను టీడీపీ ఫ్లోర్ లీడర్, నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్)ను ఆమోదించి, స్వదేశ దర్శన్ 2.0 కింద కేంద్రానికి ప్రతిపాదనను పంపిందని, ఈ ప్రాజెక్టు సుమారు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో దశలవారీగా అమలు చేయడానికి రూపుదిద్దుకుందని వివరిస్తూ.. మంత్రికి వినతి పత్రాన్ని అందించారు. కొండవీడు కోట 14వ శతాబ్దానికి చెందిన ప్రాచీన చారిత్రక స్మారక కట్టడమని, రెడ్డి రాజవంశపు మాజీ రాజధాని అని, కోట పునరుద్దరణ, తగిన సంరక్షణ చర్యలు, సందర్శకుల సౌకర్యాలు, వివరణాత్మక కేంద్రాలు, సమగ్ర పర్యాటక మౌలిక వసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
ప్రాజెక్టు అమలు ద్వారా కోట వారసత్వ సంరక్షణతో పాటు పర్యాటక అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని వివరిస్తూ.. పల్నాడు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే కీలక కార్యక్రమంగా నిలుస్తుందని తెలిపారు. మంత్రి సానుకూలంగా స్పందించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
