భారత రాజకీయ చరిత్రలో సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత నాయకుడు, దళిత జాతి రత్నం బాబూ జగ్జీవన్ రామ్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. కేంద్రంలో 29 ఏళ్లపాటు మంత్రిగా కొనసాగిన బాబూ జగ్జీవన్ రామ్ దేశ సేవే పరమ ధర్మంగా భావించి ఆచరించి చూపారని తెలిపారు.
బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం కరీంనగర్ లోని మంచిర్యాల చౌరస్తా వద్దనున్న ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బాబూ జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతోపాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘చిన్నప్పటి నుండి కుల వివక్షను ఎదుర్కొని పోరాడిన నాయకుడు జగ్జీవన్ రాం. అంటరానివారి శ్రేయస్సు కోసం తన జీవితాన్ని చివరిదాకా అంకితం చేసిన నాయకుడు. 1.కష్టాలను జయించి ఎదగాలి. 2.సమాజంలోని బలహీన వర్గాల కోసం నిలబడాలి. 3.దేశ సేవే మన పరమ ధర్మం అనే మూడు నినాదాలను పుణికి పుచ్చుకుని జీవితాంతం వాటి కోసం పాటుపడిన నాయకుడు జగ్జీవన్ రామ్’’ అని పేర్కొన్నారు.
స్వతంత్ర భారతదేశంలో తొలి ఎన్నికలు జరిగిన 1952 నుంచి ఆయన చనిపోయే 1986 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా కొనసాగిన జగ్జీవన్ రామ్ కేంద్రంలో 29 ఏళ్లపాటు మంత్రిగా సేవలందించారని గుర్తు చేసుకున్నారు.
దేశ స్వాతంత్య్ర పోరాటంలోనూ గాంధీ వెన్నంటి నడిచిన జగ్జీవన్ రామ్ భారత రాజకీయ, సామాజిక రంగాల్లో అజాతశత్రువుగా నిలిచారని తెలిపారు. జగ్జీవన్‌రామ్ అనుసరించిన ఆదర్శాలు.. చూపిన సంస్కరణ మార్గాలనూ నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY