తెలంగాణలో మరో పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది : పటేల్ రమేష్ రెడ్డి
సాక్షిత | సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట పట్టణంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరో పదేళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇటీవల గ్రామపంచాయతీ ఎన్నికలు ఈ నెల 11, 14 తేదీల్లో రెండు విడతలుగా నిర్వహించగా, సూర్యాపేట నియోజకవర్గంలో మొదటి విడతలో రెండు మండలాలు, రెండో విడతలో మరో రెండు మండలాలు మొత్తం నాలుగు మండలాల్లో ఎన్నికలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 117 గ్రామపంచాయతీలకు గాను—
కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 69 గ్రామపంచాయతీల్లో విజయం సాధించారని, బీఆర్‌ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 36 గ్రామపంచాయతీల్లో,
బీజేపీ/ఇండిపెండెంట్ అభ్యర్థులు 8 గ్రామపంచాయతీల్లో గెలిచారని వెల్లడించారు. ఇండిపెండెంట్లుగా గెలిచిన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ రెబల్స్‌గా పోటీ చేసినవారేనని స్పష్టం చేశారు. మొత్తం ఫలితాల్లో సుమారు 60 శాతం కాంగ్రెస్, 30 శాతం బీఆర్‌ఎస్, 10–15 శాతం ఇండిపెండెంట్లు విజయం సాధించారని తెలిపారు. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో గ్రామీణ వ్యవస్థ మొత్తం కాంగ్రెస్ పార్టీ వైపు బలంగా నిలిచిందని పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ మహిళా సంఘాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో పేదలకు ఇళ్ల కల నెరవేరలేదని విమర్శించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల నిర్మాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ₹500 గ్యాస్ సిలిండర్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం—వ్యక్తికి నెలకు 6 కిలోలు, ఉద్యోగ కల్పన వంటి సంక్షేమ పథకాలతో ప్రజల ఆదరణ పొందిందని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో—కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు 4,665, బీఆర్‌ఎస్ 2,354,
బీజేపీ 457, ఇండిపెండెంట్లు 1,025 మంది గెలిచారని తెలిపారు. జూబ్లీహిల్స్ సహా గ్రామపంచాయతీ ఎన్నికల్లోనూ ప్రజలు బీఆర్‌ఎస్‌ను స్పష్టంగా తిరస్కరించారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 90 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
వచ్చే పది సంవత్సరాల పాటు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా పలు దేశాల నుంచి సుమారు ₹5 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమతుల్యంగా నడిపిస్తూ తెలంగాణను దేశంలో నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గంలో గెలిచిన సర్పంచులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కొద్దివోట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులు నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంతో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరమై ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన వారందరికీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం పలికారు.

