నామినేషన్ వేసిన అభ్యర్థులను బలవంతంగా ఉపసంహరణకు ఒత్తిడి చేయవద్దు

Sakshitha news

నామినేషన్ వేసిన అభ్యర్థులను బలవంతంగా ఉపసంహరణకు ఒత్తిడి చేయవద్దు
ఉపసంహరణ అనంతరం ఒక్కటే నామినేషన్ మిగిలితే స్పెషల్ సెల్ ద్వారా పరిశీలన – జిల్లా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి
గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా సహకరించండి – రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరిన సాధారణ ఎన్నికల పరిశీలకులు మల్లయ్య బట్టు
అభ్యర్థులు గెలిచిన, ఓడిన ఎన్నికల వ్యయాన్ని 45 రోజుల్లో సమర్పించాలి… లేదంటే అనర్హత వేటు – ఎన్నికల వ్యయ పరిశీలకులు యం. శ్రీనివాసులు

సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్నికల అథారిటీ ఆదర్శ్ సురభి వివరిస్తూ జిల్లాలో ఎవరినైనా నామినేషన్ వేయనీయకుండా అడ్డుపడినా లేదా నామినేషన్ వేసిన అభ్యర్థిని బలవంతంగా ఉపసంహరణ చేయించిన ఎన్నికల ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాలో అధికారులతో ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఉపసంహరణ అనంతరం ఒకే ఒక మైనేషన్ మిగిలితే స్పెషల్ సెల్ ద్వారా విచారణ చేయడం జరుగుతుందన్నారు. ఉపసంహరణ చేసే సమయంలో అభ్యర్థులు నాకు ఎవరు బలవంతం చేయలేదు, నాపై ఎలాంటి ఒత్తిడి లేదని ధృవీకరణ పత్రం పై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు.


ఎన్నికల సాధారణ పరిశీలకులు మల్లయ్య బట్టు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో ప్రజలు స్వచ్ఛందంగా, సంతోషంగా తనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసే విధంగా ప్రశాంత వాతావరణం కల్పించాలని, ఓటర్లకు ఎలాంటి ప్రలోభాలకు గురి చేయకుండా తమ వంతు సహకారం అందించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను సూచించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని తూచ తప్పకుండా పాటించాలని సూచించారు.


ఎన్నికల వ్యయ పరిశీలకులు యం శ్రీనివాసులు మాట్లాడుతూ నామినేషన్ వేసే ముందు అభ్యర్థి పేరున ఒక కొత్త బ్యాంకు అకౌంట్ తెరవాలని, ఎన్నికల వ్యయం మొత్తం ఇతకౌంట్ ద్వారానే చేయాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ సమయంలో ఒక ఎక్స్పెండిచర్ బుక్ ఇవ్వడం జరుగుతుందని అందులో ఎన్నికలకు చేసే ప్రతి ఖర్చును నమోదు చేసి 15 రోజులకు ఒకసారి మూడు పర్యాయాలు ఎక్స్పెండిచర్ నోడల్ అధికారికి చూపించి అందులో సంతకం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. 45 రోజుల్లో ఎన్నికల ఖర్చు పూర్తి వివరాలు బిల్లులు, ఓచర్లతో సహా లెక్క చూపించాల్సి ఉంటుందన్నారు. గెలిచిన లేదా ఓడిన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి లెక్క ఇవ్వాల్సి ఉంటుందని ఒకవేళ ఇవ్వని పక్షంలో గెలిచిన అభ్యర్థిని అనర్హుడిగా ప్రకటించడం, ఓడిన అభ్యర్థిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా బ్లాక్ లిస్టు లో పెట్టడం జరుగుతోందన్నారు.


2011 జనాభా లెక్కల ప్రకారం 5000 కంటే ఎక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో సర్పంచి కినోటి చేసిన అభ్యర్థి 2.5 లక్షల వరకు ఖర్చు చేయవచ్చని, అంతకన్నా తక్కువ జనాభా ఉంటే 1.5 లక్షల వరకు వ్యయ పరిమితి ఉందన్నారు. అదే వార్డు మెంబర్ అయితే 5 వేల జనాభా కంటే ఎక్కువ ఉంటే 50,000 లు అంతకన్నా తక్కువ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలో గరిష్టంగా 30 వేల వరకు మాత్రమే ఖర్చు చేసే విధంగా నిబంధనలు ఉన్నాయన్నారు.


ఎన్నికల ఖర్చులు మొత్తం కొత్తగా తీసుకున్న బ్యాంకు అకౌంట్ నుండి మాత్రమే ఖర్చు చేయాలని, 5000 రూపాయలు అంతకన్నా తక్కువ ఖర్చులు చేస్తే నగదు రూపంలో చేయవచ్చని అంతకన్నా ఎక్కువ ఖర్చు చేస్తే చెక్కు రూపంలో లేదా డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో లావాదేవీలు జరపాల్సి ఉంటుందని వివరించారు.
ఈ సమావేశంలో డివిజనల్ పంచాయతీ అధికారి రఘుపతి రెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు బిజెపి నుంచి పెద్దిరాజు, ఏఐఎంఐఎం నుండి ఎం.ఏ. రహీం, టిడిపి నుంచి బాలరాజు, బీఎస్పీ ఎల్లస్వామి, కాంగ్రెస్ నుండి రాజేందర్, సిపిఐ పరమేశ్వర చారి, బిఆర్ఎస్ సయ్యద్ జమీల్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top