పుణ్యప్రదంగా అమ్మవారి పంచమీ తీర్థం

Sakshitha news

పుణ్యప్రదంగా అమ్మవారి పంచమీ తీర్థం

** శ్రీవారి కానుకగా… కమలాల హారం, వజ్రాల అడ్డిగ

** అందరి సేవలను అభినందించిన టీటీడీ ఛైర్మన్

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకుని కార్తీక బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం పంచమీ తీర్థం(చక్రస్నానం) అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా…. పుణ్య ప్రదంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్రస్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు.
ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ బొల్లినేని రాజగోపాల్ (బీఆర్) నాయుడు మీడియాతో మాట్లాడుతూ, లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమీతీర్థ మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. వేలాదిమంది భక్తులు పుణ్య స్థానాలు ఆచరిస్తున్నట్లు చెప్పారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు పటిష్టమైన ఏర్పాట్లు చేసి, విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణాకటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అంతకు ముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవర్లను ఊరేగింపుగా పంచమీతీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4.30 గంటలకు బయలుదేరిన సారె ఉదయం 11 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

అమ్మవారికి శ్రీవారి కానుక

శ్రీ పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థం సందర్బంగా శ్రీ వేంకటేశ్వర స్వామివారు కానుకలు పంపారు. రూ.1.31 కోట్లు విలువైన 1.14 కిలోల బరువు గల బంగారు కమలముల హారం,
వజ్రాల అడ్డిగ నగ, సారెతో పాటు తిరుప‌తి పుర‌వీధుల‌లో ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి అలంకరించారు. కాగా
పంచమీ తీర్థ మండపంలో అమ్మవారికి, చక్రత్తాళ్వార్‌కు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన కుంకుమపువ్వు, పైనాపిల్, డ్రై ఫ్రూట్స్, రెడ్ మరియు ఎల్లో రోజాపెటల్స్, వట్టివేరు, తులసిమాల‌లు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి. మధ్యాహ్నం 12.10 నుంచి 12.20 గంటల మధ్య పంచమి తీర్థం(చక్రస్నానం) ఘట్టం ఘనంగా జరిగింది. చక్రత్తాళ్వార్‌తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. మంగళవారం రాత్రి 10 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీ చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, చంద్రగిరి ఎంఎల్‌ఏ పులివర్తి నాని, బోర్డు స‌భ్యులు ఎన్. సదాశివరావు, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నరేష్ కుమార్, ఎం.శాంతారామ్, జానకి దేవి, అనుగోలు రంగశ్రీ, ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్‌వో కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. బుధ‌వారం ఆలయంలో పుష్పయాగం సాయంత్రం 5 నుండి 8 గంటల వరకు వైభవంగా జరగనుంది.

Scroll to Top