భక్తులతో మర్యాదగా మెలగాలి

Sakshitha news

భక్తులతో మర్యాదగా మెలగాలి

** అర్బన్ హాట్ సమావేశంలో ఎస్పీ సుబ్బరాయుడు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: అమ్మవారికి సేవ చేయడం పూర్వజన్మ సుకృతంగా భావించాలని, మంగళవారం తిరుచానూరులో జరగనున్న పంచమీ తీర్థంలో పోలీసులు భక్తులతో మర్యాదగా మెలగాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బరాయుడు కోరారు. శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టంగా నిర్వహించబడే పంచమి తీర్థం (చక్రస్నానం) ఉత్సవం సందర్భంగా భక్తులు అశేషంగా రానున్న నేపథ్యంలో బందోబస్తు అధికారులు, సిబ్బందితో అర్బన్ హాట్ లో విస్తృత సమీక్షా సమావేశాన్ని ఎస్పీ నిర్వహించారు. పక్క రాష్ట్రాలు మాత్రమే కాకుండా దేశ నలుమూలల నుండి భక్తులు పంచమి గడియలో పుణ్యస్నానం ఆచరించడానికి రానున్న నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్, రద్దీ నియంత్రణ మొదలగు అంశాలను దృష్టిలో ఉంచుకొని అత్యంత అప్రమత్తతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరికిచ్చిన విధులు వారు సక్రమంగా నిర్వహించి విజయవంతంగా పంచమి తీర్ధాన్ని ముగించాలి అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.

కేటాయించిన క్యూ లైన్ల ద్వారానే భక్తులు ప్రవేశించి, బయటకు వచ్చేలా చూడాలన్నారు. అనంతరం ఎస్పి టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం, టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణలతో కలిసి పుష్కరిణి, పసుపు మండపం, ఎంట్రీ-ఎగ్జిట్ మార్గాలు, హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాలు, క్యూ లైన్ వ్యవస్థ, వైద్య సహాయక కేంద్రాలు, కమాండ్ కంట్రోల్ అనుసంధానం వంటి కీలక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి తక్షణ సూచనలు జారీ చేశారు. పుష్కరిణి వద్ద జారి పడే ప్రమాదం లేకుండా మ్యాట్లు, బారికేడ్లు, లైఫ్ జాకెట్లు, శిక్షణ పొందిన స్విమ్మర్లు, రక్షణ బృందాలు సిద్ధంగా ఉండేలా చూడాలని, నీటిమట్టం పరిశీలన నిరంతరం చేయాలని సూచించారు. ఎంట్రీ–ఎగ్జిట్ పాయింట్ల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉండే సమయంలో వేగవంతమైన తరలింపుతో గుంపు నియంత్రణ నిర్వహించాలని, హోల్డింగ్ పాయింట్లలో గుంపు నిల్వ పెరగకుండా ఫేజ్ వైజ్ విడుదల చేపట్టాలని ఆదేశించారు. పార్కింగ్ ప్రాంతాల్లో కూడా వాహనాల ప్రవేశ–నిష్క్రమణ సాఫీగా నిర్వహిస్తూ ట్రాఫిక్ డైవర్షన్లు అమలు చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. అలాగే మహిళలు, వృద్ధులు, పిల్లల కోసం ప్రత్యేక సహాయక దళాలు, వాలంటీర్లు ఏర్పాటు చేయాలని, తప్పిపోయిన పిల్లలు, వృద్ధులకు కౌంటర్ ప్రారంభించాలన్నారు.

Scroll to Top