కాంగ్రెస్ 6 గ్యారెంటీలు.. 420 హామీలపై ప్రజల్లోకి బీజేపీ….
‘ప్రశ్నిస్తున్న రామగుండం’తో హామీల అమలుపై నిలదీస్తున్న బీజేపీ శ్రేణులు….
– కార్యక్రమాన్ని అభినందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపురాజు రాంచందర్రావు….
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, రామగుండం/ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలుపై ప్రజలను చైతన్యపరచడమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర నాయకురాలు, మాజీ కార్పొరేటర్ సోమారపు లావణ్య ఆధ్వర్యంలో ‘ప్రశ్నిస్తున్న రామగుండం’ కార్యక్రమం కొనసాగుతోంది.
రామగుండం పారిశ్రామిక ప్రాంత అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్న సోమారపు లావణ్య కార్యక్రమాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నరపురాజు రాంచందర్రావు ఫోన్లో అభినందించారు. గత వారం రోజులుగా బీజేపీ కార్యకర్తలు రామగుండం కార్పొరేషన్లోని వివిధ డివిజన్లలో పర్యటిస్తూ ప్రజలను కలుస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.
ప్రతి డివిజన్లో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడంతో పాటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని బీజేపీ నాయకులు తెలిపారు. ‘ప్రశ్నిస్తున్న రామగుండం’ కార్యక్రమం ద్వారా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ మరింత విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా, బీజేపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తే తాను తప్పక హాజరవుతానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పోరాటం కొనసాగిస్తామని సోమారపు లావణ్య పేర్కొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST