వినాయక ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి…
భద్రత, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలి…
–అధికారులకు శ్రీ గణేష్ ఉత్సవ సమితి వినతి…
సాక్షిత పెద్దపల్లి- జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ : గణేష్ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు మున్సిపల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ శ్రీ గణేష్ ఉత్సవ సమితి గోదావరిఖని ఆధ్వర్యంలో పోలీస్, మున్సిపల్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు.
విశ్వహిందూ పరిషత్ అనుబంధంగా పనిచేస్తున్న శ్రీ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో డీసీపీ (పరిపాలన) కె. శ్రీనివాస్‌ను, అలాగే ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.
డీసీపీ కె. శ్రీనివాస్‌కు అందజేసిన వినతిపత్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పోలీసులు విధిస్తున్న నిబంధనలు, ఆంక్షలపై హిందూ సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉత్సవాల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రతా చర్యలు చేపట్టాలని, గోదావరిఖని నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ అరుణశ్రీ ఐఏఎస్‌ను కలిసి నగరంలో ఉత్సవాలకు ముందే మున్సిపల్ శాఖకు సంబంధించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రధాన రహదారులు, వీధుల్లో అవసరమైన మరమ్మతులు చేపట్టడంతో పాటు వీధి దీపాలను సరిచేయాలని, రహదారులకు ఇరువైపులా ఇబ్బందికరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు.
గణేష్ ఉత్సవాల సమయం దగ్గర పడిన తర్వాత హడావుడిగా పనులు చేపట్టడం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, అందువల్ల ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సమితి ప్రతినిధులు కోరారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో 11 రోజుల పాటు సిరీస్ విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడంతో పాటు ఉత్సవాలకు సంబంధించిన మున్సిపల్ పనులను సకాలంలో పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
వినాయక నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని శ్రీ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు కోరారు.
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులు అయోధ్య రవీందర్, అడిగొప్పుల రాజు, మునిగాల సంపత్, ముష్కే సంపత్ యాదవ్, నేరేడుకొమ్మ వెంకటస్వామి, మొడెం సురేందర్, కాస సత్యనారాయణ, కొండపర్తి లింగన్న, జక్క రాయమల్లు, రాజిరెడ్డి, మ్యాడగొని అరవింద్ తదితరులు పాల్గొన్నారు.


KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST