సర్వీస్ రోడ్లు పూర్తయ్యే వరకు ఈ-చలాన్లు నిలిపివేయాలి…
ఎన్టీపీసీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలి….
— సీపీఎం ఏరియా కార్యదర్శి రామాచారి…
సాక్షిత న్యూస్ పెద్దపల్లి -జిల్లా ప్రతినిధి, గోదావరిఖని/ఆగస్టు-22: ఎన్టీపీసీ ప్రాంతంలో సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయడంతో పాటు, సర్వీస్ రోడ్లు అందుబాటులోకి వచ్చే వరకు స్థానిక వాహనదారులపై ఈ-చలాన్ల జారీని నిలిపివేయాలని సీపీఎం నాయకులు కోరారు. ఈ మేరకు రామగుండం ట్రాఫిక్ ఏసీపీకి సీపీఎం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.
ఎన్టీపీసీ జ్యోతినగర్ ప్రాంతంలో ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఎఫ్‌సీఐ కార్నర్, మేడిపల్లి సెంటర్‌లలో ట్రాఫిక్ సిగ్నల్స్ నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.
రామగుండం తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్టాండ్ వరకు సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయడానికి సంబంధిత శాఖలపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీపీసీ ప్రాంతంలో నిత్యావసర దుకాణాలు, షాపింగ్ మాల్స్, షోరూమ్‌లు, బ్యాంకులు, మీ-సేవ కేంద్రాలు ఉన్నప్పటికీ సర్వీస్ రోడ్లు లేక ప్రజలు ప్రధాన రహదారిపైకి రావాల్సి వస్తోందని పేర్కొన్నారు.
సర్వీస్ రోడ్లు లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రధాన రహదారిని వినియోగించాల్సి వస్తోందని, ఈ నేపథ్యంలో రాంగ్ రూట్ పేరుతో భారీ మొత్తంలో ఈ-చలాన్లు విధిస్తున్నారని ఆరోపించారు. సర్వీస్ రోడ్లు పూర్తయ్యే వరకు స్థానిక ప్రజలపై ఈ-చలాన్ల జారీని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.
ఎఫ్‌సీఐ కార్నర్ నుంచి ఇల్లందు గెస్ట్‌హౌస్ వరకు యూటర్న్ కిలోమీటర్‌కు పైగా దూరంలో ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. శాలపల్లి, మల్కాపూర్, రామయ్యపల్లి, జంగాలపల్లి గ్రామాల ప్రజల రాకపోకలతో సింధూర కాలేజీ రహదారిపై రద్దీ పెరుగుతోందని, ప్రజల సౌకర్యార్థం ఎస్‌బీఐ రామగుండం సమీపంలోని హైవే డివైడర్ వద్ద అవసరమైన మార్పులు చేసి కుడివైపు మలుపు తీసుకునే అవకాశం కల్పించాలని కోరారు.
స్థానిక ప్రజలు హైవేపై రాంగ్‌రూట్‌లోకి వెళ్లకుండా రహదారి అంచుల్లో రేలింగ్‌లు ఏర్పాటు చేయాలని, ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ నంబర్–2 వద్ద ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు.
ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకులు విజ్ఞప్తి చేశారు.
వినతిపత్రం సమర్పించిన వారిలో సీపీఎం ఏరియా కార్యదర్శి ఎం. రామాచారి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్. బిక్షపతి, జి. లక్ష్మారెడ్డి, గుండు కనకయ్య, డి. రాఘవరెడ్డి, కాదాసి మల్లేష్ తదితరులు ఉన్నారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్ ఠాకూర్, రామగుండం మేయర్ మహంకాళి స్వామికి కూడా వినతిపత్రం ప్రతులను అందజేశారు.

KATRAM MANJULATHA REDDY PUBLISHER OF SAKSHITHA NEWSPAPER AND MANAGING DIRECTOR AT SAKSHITHA NEWS CHANNEL & DIGITAL MEDIA, SENIOR JOURNALIST, POLITICAL ANALYST
