ఆయిల్ పామ్ సాగుతో రైతులకు స్థిరమైన ఆదాయం.. నీటి వసతి ఉన్న రైతులు ముందుకు రావాలి….
–డా. కె.రామచంద్రుడు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: సుల్తానాబాద్,
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కోడూరుపాక గ్రామంలోని వాగుడ్డుపల్లిలో రైతు దేవవారనేని రాజేశ్వర్ రావుకు చెందిన 20 ఎకరాల వ్యవసాయ భూమిలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో భాగంగా ఆయిల్ పామ్ మొక్కల నాటకం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా పెద్దవేగిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ (IIOPR) ప్రధాన శాస్త్రవేత్త డా. కె. రామచంద్రుడు హాజరై రైతులతో కలిసి ఆయిల్ పామ్ మొక్కలను నాటారు.
ఈ సందర్భంగా డా. రామచంద్రుడు మాట్లాడుతూ ఆయిల్ పామ్ దీర్ఘకాలిక ఆదాయం అందించే వాణిజ్య పంట అని, నాటిన మూడో సంవత్సరం నుంచి దిగుబడులు ప్రారంభమవుతాయని తెలిపారు. సరైన నీటి యాజమాన్యం, ఎరువుల నిర్వహణ, శాస్త్రీయ సాగు పద్ధతులు పాటిస్తే రైతులు అధిక దిగుబడులతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా నీటి వసతి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు వైపు ముందుకు రావాలని సూచించారు.
ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని, శాస్త్రీయ సూచనలను అనుసరించడం ద్వారా దీర్ఘకాలిక లాభాలు పొందవచ్చని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో చిన్నకల్వల ఫాక్స్ చైర్మన్ దేవవారనేని మోహన్ రావు, జిల్లా ఉద్యాన & పట్టు పరిశ్రమల అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్, తిరుమల ఆయిల్ పామ్ సీఈఓ కేషు కల్యాంకర్, ప్రజాప్రతినిధులు, ఉద్యాన అధికారి సుంకే మహేష్, ఉద్యాన విస్తరణ అధికారులు, ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ శ్రీధర్, రైతులు దేవవారనేని రాజేశ్వర్ రావు, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.

