సింగరేణి హక్కుల పోరాటానికి ఫలితం…

Sakshitha news

సింగరేణి హక్కుల పోరాటానికి ఫలితం…

తాడిచెర్ల కోల్ బ్లాక్-2 కేటాయింపు కార్మికుల విజయమే…

–ఎంపీ వంశీకృష్ణ గడ్డం..

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: : సింగరేణి సంస్థ హక్కుల పరిరక్షణ కోసం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ గడ్డం అన్నారు. కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేటాయించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.

విడుదల చేసిన ప్రకటనలో ఎంపీ మాట్లాడుతూ, ఎన్నికల ప్రచార సమయంలోనే తెలంగాణ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామితో కలిసి సింగరేణి సంస్థకు జరుగుతున్న అన్యాయంపై గళం విప్పామని, సింగరేణి ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పోరాడతామని ప్రజలకు హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

ఆ హామీకి అనుగుణంగానే గత రెండేళ్లుగా సింగరేణికి హక్కుగా రావాల్సిన కోల్ బ్లాక్‌ల కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తిడి తీసుకొచ్చామని తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని పలుమార్లు కలిసి తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని, అదే అంశంపై పార్లమెంట్‌లో ప్రశ్నలు లేవనెత్తి సింగరేణి కార్మికుల గొంతుకగా నిలిచామని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణికి కేటాయించడం సంస్థ అభివృద్ధికి మాత్రమే కాకుండా తెలంగాణ రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా కీలక నిర్ణయమని ఎంపీ అన్నారు. ఈ కేటాయింపుతో సింగరేణి సంస్థ మరింత బలోపేతం కావడంతో పాటు వేలాది మంది యువతకు ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

“ఇది కేవలం కోల్ బ్లాక్ కేటాయింపు మాత్రమే కాదు… సింగరేణి కార్మికుల పోరాటానికి దక్కిన విజయం. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు లభించిన గౌరవం. సింగరేణి హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం మా పోరాటం భవిష్యత్తులో కూడా ఇదే నిబద్ధతతో కొనసాగుతుంది” అని ఎంపీ వంశీకృష్ణ గడ్డం స్పష్టం చేశారు.

Scroll to Top