సీఎంఆర్ బియ్యం అక్రమ దారిమళ్లింపుపై ఉక్కుపాదం….
నిందితుడిపై పీడీ యాక్ట్ అమలు – రామగుండం పోలీస్ కమిషనర్….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: రామగుండం, ప్రజలకు ప్రభుత్వం అందించే ఆహార భద్రతా పథకాలకు భంగం కలిగిస్తూ ప్రభుత్వ సీఎంఆర్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించే వారిపై కఠిన చర్యలు తప్పవని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. ప్రభుత్వ ధాన్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా కట్టరాంపూర్‌కు చెందిన బండారి మారుతి (43)పై ప్రివెన్షన్ ఆఫ్ బ్లాక్ మార్కెటింగ్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సప్లైస్ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్–1980 కింద ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ అమలు చేశారు. పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల మేరకు సుల్తానాబాద్ సీఐ పి. రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్ కరీంనగర్ జిల్లా జైలులో నిందితుడికి పీడీ యాక్ట్ ఉత్తర్వులను అందజేసి, అనంతరం చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు.
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం, 2023–24 రబీ, ఖరీఫ్ సీజన్లలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థతో కస్టమ్ మిల్లింగ్ ఒప్పందం కుదుర్చుకున్న నిందితుడు మొత్తం 11,213.040 మెట్రిక్ టన్నుల వరిని స్వీకరించి, ప్రభుత్వానికి అప్పగించాల్సిన 7,624.867 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ బియ్యాన్ని అందజేయకుండా ఇతర రైస్ మిల్లులకు అక్రమంగా విక్రయించినట్లు గుర్తించారు. ఈ చర్యల వల్ల ప్రభుత్వానికి రూ.27 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై 2024 నుంచి 2026 వరకు పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, ఒక కేసులో బెయిల్‌పై విడుదలైన తర్వాత కూడా అదే తరహా నేరాలకు పాల్పడినట్లు గుర్తించామని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం మరో కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న అతను విడుదలైతే తిరిగి ప్రజా పంపిణీ వ్యవస్థకు భంగం కలిగించే అవకాశం ఉన్నందున ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పీడీ యాక్ట్ అమలు చేసినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, ప్రభుత్వ ధాన్యం పేదల హక్కు అని, దానిని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం లేదా అలాంటి నేరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించే వారిపైనా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీఎంఆర్ బియ్యం అక్రమ దారిమళ్లింపుపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని తెలిపారు.
ఈ కేసులో పీడీ యాక్ట్ అమలుకు కృషి చేసిన పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ పి. రంజిత్‌రావు, ఎస్సై చంద్రకుమార్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.

