రామగుండంలో రూ.200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు త్వరలో శ్రీకారం

Sakshitha news

రామగుండంలో రూ.200 కోట్ల యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు త్వరలో శ్రీకారం…

నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, రామగుండం నియోజకవర్గంలో ఆధునిక విద్యా సదుపాయాలతో రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక విద్యా ప్రాజెక్టుకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.

గురుకుల పాఠశాల సమీపంలోని 26 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న స్కూల్‌కు సంబంధించి రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏఈ నరేశ్, ఎంవీఆర్ కన్స్ట్రక్షన్స్ సీఈవో విజయ్ కుమార్, సీనియర్ ఇంజినీర్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్మాణ ప్రణాళికలను వివరించారు. అనంతరం శనివారం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, పనుల పురోగతి, ప్రణాళికలపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా వాతావరణాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందులో విశాలమైన తరగతి గదులు, అత్యాధునిక ప్రయోగశాలలు, గ్రంథాలయం, క్రీడా మైదానాలు, బాలురు–బాలికలకు ప్రత్యేక సీనియర్, జూనియర్ హాస్టళ్లు, సిబ్బంది నివాస గృహాలు, పేరెంట్స్ వెయిటింగ్ హాల్స్‌తో పాటు అన్ని ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు చెప్పారు.

ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరలో ప్రారంభించి 18 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ విద్యాసంస్థ అందుబాటులోకి రావడం ద్వారా రామగుండం నియోజకవర్గ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అత్యుత్తమ వసతి, శిక్షణ సౌకర్యాలు లభిస్తాయని తెలిపారు.

అదేవిధంగా, ఎన్‌టీపీసీ సంస్థ తన సీఎస్‌ఆర్ నిధులను రామగుండం నియోజకవర్గంలోనే వినియోగిస్తూ విద్య, మౌలిక వసతులు, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు మరింత సహకారం అందించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సూచించారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Scroll to Top