ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రాధాన్యం….
అశోక్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి:గోదావరిఖని, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్నారు. గోదావరిఖనిలోని అశోక్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను ఆయన సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజన పథకం అమలు, విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను ఎమ్మెల్యే క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ వారి చదువులు, పాఠశాల వాతావరణం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఉపాధ్యాయులతో సమావేశమైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు మరింత అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రతి విద్యార్థి విద్యలో రాణించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పాఠశాల అభివృద్ధికి అవసరమైన సమస్యలు, మౌలిక వసతుల అవసరాలను తెలుసుకున్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా బలోపేతం చేసి విద్యార్థులకు మెరుగైన విద్యా వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.

