రిటైర్డ్ కార్మికుల హక్కులను కాలరాయొద్దు…
పి.ఎఫ్, పెన్షన్ చెల్లింపుల్లో జాప్యం వెంటనే నివారించాలి….
— ఏఐటియుసి…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: గోదావరిఖని, సింగరేణి సంస్థలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవీ విరమణ పొందిన కార్మికులకు పి.ఎఫ్. సెటిల్‌మెంట్‌తో పాటు పెన్షన్ సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాల్సి ఉండగా, గోదావరిఖని గనుల భవిష్యనిధి కార్యాలయంలో నెలల తరబడి ఫైళ్లను పెండింగ్‌లో ఉంచి రిటైర్డ్ కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి ఆరోపించారు.
విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి నుంచి రామగుండం, బెల్లంపల్లి ప్రాంతాలకు చెందిన కార్మికుల పి.ఎఫ్., పెన్షన్ దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. కొత్తగూడెం ప్రాంతంలో సెటిల్‌మెంట్లు సకాలంలో పూర్తవుతున్నప్పటికీ, గోదావరిఖని కార్యాలయంలో మాత్రం అవసరం లేని కారణాలు చూపిస్తూ జాప్యం చేస్తున్నారని విమర్శించారు.
డేటా సరిగా లేదని, అదనపు సమాచారం కావాలని చెబుతూ అధికారులు పదవీ విరమణ పొందిన కార్మికులను కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని అన్నారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన ప్రాంతీయ కమిషనర్ సమస్యలు పరిష్కరించాల్సింది పోయి కొత్త సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ధన్‌బాద్‌లోని ఉన్నతాధికారుల దృష్టికి ఏఐటియుసి తరఫున తీసుకెళ్లినట్లు తెలిపారు. అలాగే సంబంధిత విభాగం, కంపెనీ అధికారులతో కూడా చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు.
60 ఏళ్లకు పదవీ విరమణ పొంది 61వ. సంవత్సరంలోకి ప్రవేశించిన కార్మికుల పి.ఎఫ్., పెన్షన్ ఫైళ్లను వెంటనే పరిష్కరించాలని, పెళ్లిళ్లు, పిల్లల చదువుల కోసం దరఖాస్తు చేసుకున్న రుణాలను కూడా ఆలస్యం చేయకుండా మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
గోదావరిఖని గనుల భవిష్యనిధి కార్యాలయంలో రిటైర్డ్ కార్మికులకు ఇబ్బందులు లేకుండా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. వేధింపుల ధోరణి మార్చుకోకపోతే ఏఐటియుసి ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కవ్వంపల్లి స్వామి హెచ్చరించారు.

