శ్రీరంగనాయక స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని

Sakshitha news

శ్రీరంగనాయక స్వామివారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని
సాక్షిత వనపర్తి
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తన కుటుంబ సభ్యులతో కలిసి వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని ప్రసిద్ధ శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాయక స్వామి దేవాలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ మొక్కలను అందజేసి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు, సిబ్బంది మంగళవాయిద్యాల నడుమ సాంప్రదాయబద్ధంగా ఆలయంలోకి ఆహ్వానించారు.

ఆలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీరంగనాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనాలతో ప్రత్యేక ఆశీర్వాదం అందజేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

తదనంతరం ఆలయ పరిసరాలను సందర్శించి అక్కడి సహజ సౌందర్యాన్ని వీక్షించారు. ఆలయంలోని మ్యూజియంను సందర్శించి అక్కడ ప్రదర్శించిన చారిత్రక చిత్రాలు, కళాఖండాలను ఆసక్తిగా పరిశీలించి ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, స్థానిక సర్పంచ్ మద్దిలేటి, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.