విద్యార్థినుల భద్రతకు అండగా షీ టీమ్
వేధింపులను సహించొద్దు…
ధైర్యంగా “నో” చెప్పడం నేర్చుకోండి…
–మంచిర్యాల డీసీపీ ఏ.భాస్కర్…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిథి: మంచిర్యాల,విద్యార్థినుల భద్రత, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని పరిరక్షించడమే షీ టీమ్ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో మంచిర్యాల షీ టీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
మహిళలు, విద్యార్థినులు ఎలాంటి వేధింపులు ఎదురైనా మౌనంగా భరించకుండా వెంటనే షీ టీమ్‌ను ఆశ్రయించాలని సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటే భయపడాల్సిన అవసరం లేదని, ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతూ తక్షణ చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
సామాజిక మాధ్యమాలు, ఫోన్ కాల్స్, సందేశాలు లేదా ప్రత్యక్షంగా ఎలాంటి వేధింపులు ఎదురైనా వాటిని నిర్లక్ష్యం చేయకుండా వెంటనే షీ టీమ్‌కు తెలియజేయాలని కోరారు. “పోనీలే” అనే భావనతో వేధింపులను భరిస్తే సమస్యలు మరింత తీవ్రమవుతాయని హెచ్చరించారు.
విద్యార్థులు జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే అవసరమైనప్పుడు ధైర్యంగా “నో” చెప్పడం అలవాటు చేసుకోవాలని డీసీపీ సూచించారు. ఇష్టం లేని లేదా భవిష్యత్తుకు హాని కలిగించే విషయాలను తిరస్కరించే వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. ఇతరులను అనుసరించి చదువులు లేదా వృత్తులను ఎంచుకోవడం కంటే, తమ ఆసక్తులు, ప్రతిభ, సామర్థ్యాలకు అనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు.
జీవితంలో ఎదురయ్యే సమస్యలను చూసి భయపడకుండా, వాటి మూల కారణాలను గుర్తించి ప్రశాంతంగా విశ్లేషిస్తే పరిష్కారం సులభమవుతుందని తెలిపారు. గణిత సమస్యను పరిష్కరించినట్లే జీవితంలోని ప్రతి సవాలును సరైన ప్రణాళికతో ఎదుర్కొంటే విజయాన్ని సాధించవచ్చని విద్యార్థినులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్. ప్రకాష్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, జిల్లా షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్‌ఐ ఉషారాణి, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనూష, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

