కార్మిక హక్కుల సాధనకు ఐక్య పోరాటం….
….
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: గోదావరిఖని, కార్మిక వ్యతిరేక నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి, బొగ్గు గని కార్మికుల వేతన సవరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని జాతీయ కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గోదావరిఖనిలో నిర్వహించిన సంయుక్త సమావేశంలో కార్మిక సంఘాల ప్రతినిధులు కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు.
బొగ్గు పరిశ్రమ కార్మికులకు సంబంధించిన వేతన సవరణ ఒప్పందం ఏర్పాటులో జాప్యం జరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులకు భంగం కలిగించే విధానాలను విరమించుకోవాలని కోరారు. కార్మిక సంక్షేమం కంటే కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు.
సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల సాధన, కార్మిక వ్యతిరేక చట్టాల రద్దు, వేతన సవరణ ప్రక్రియ తక్షణ ప్రారంభం కోసం జూలై 1న భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డా. బి. జనక్ ప్రసాద్, నరసింహారెడ్డి, ధర్మపురి, వాసిరెడ్డి సీతారామయ్య, మడ్డి ఎల్లయ్య, రాజిరెడ్డి, రాజమౌళి, సారయ్య, అనిల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమాల భాగంగా జూన్ 29న శ్రీరాంపూర్, భూపాలపల్లిలో, జూన్ 30న కొత్తగూడెంలో అవగాహన సమావేశాలు నిర్వహించనుండగా, జూలై 1న కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు.
