జాతీయ మెగా లోక్ అదాలత్ ఘన విజయం….

Ambar Kishor Jha is seated between the Indian tricolour and Telangana Police flags.

Sakshitha news

జాతీయ మెగా లోక్ అదాలత్ ఘన విజయం….

సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి: రామగుండం కమిషనరేట్‌లో జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతం 6,545 కేసుల పరిష్కారం – సైబర్ బాధితులకు రూ.73.67 లక్షల తిరిగి అందజేత
రామగుండం, జూన్ 22: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ విశేష విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మొత్తం 6,545 కేసులను పరిష్కరించినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.

జూన్ 20న నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై దర్యాప్తులో ఉన్న, అలాగే కోర్టు విచారణలో ఉన్న కాంపౌండబుల్ కేసులను పరిష్కరించారు. ఇందులో 637 ఐపీసీ కేసులు, 46 ప్రత్యేక చట్టాలకు సంబంధించిన కేసులు, 3,097 ఈ-పెట్టి కేసులు, 2,809 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, విపత్తు నిర్వహణ చట్టానికి సంబంధించిన 2 కేసులు ఉన్నాయి.

అదేవిధంగా సైబర్ నేరాల బాధితులకు ఉపశమనం కల్పిస్తూ 83 సైబర్ నేర కేసుల్లో మొత్తం రూ.73,67,714లను తిరిగి అందజేశారు. ఇందులో కమిషనరేట్ పరిధిలోని 76 కేసుల్లో రూ.27,35,072, సీసీఎస్ పోలీస్ స్టేషన్ రామగుండంలో నమోదైన 7 కేసుల్లో రూ.46,32,647లను బాధితులకు తిరిగి చెల్లించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మాట్లాడుతూ, లోక్ అదాలత్ ద్వారా పెట్టి కేసులు, ట్రాఫిక్, ఎక్సైజ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తదితర స్వల్ప చట్టపరమైన కేసులు వేగంగా పరిష్కారమయ్యాయని తెలిపారు. కేసుల పరిష్కారంతో ప్రజలకు సమయం, ధనం ఆదా కావడంతో పాటు న్యాయం త్వరితగతిన అందిందన్నారు.

గత 15 రోజులుగా పోలీసులు, కోర్టు సిబ్బంది కేసుల్లోని పక్షాలను స్వయంగా కలిసి రాజీ మార్గం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అవగాహన కల్పించడం వల్ల నిర్దేశించిన లక్ష్యాన్ని మించి కేసులు పరిష్కరించగలిగామని పేర్కొన్నారు.
జాతీయ మెగా లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని కమిషనర్ అభినందించారు. ప్రతిరోజూ పర్యవేక్షణ నిర్వహించిన అధికారులు, విశేషంగా శ్రమించిన సిబ్బందికి త్వరలో రివార్డులు అందజేస్తామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రెండు జోన్ల ప్రధాన న్యాయమూర్తులు, జిల్లా న్యాయ సేవా సంస్థలకు పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.