అంగన్వాడీల్లో చేరితే పిల్లల మేధోశక్తి, చురుకుదనం పెరుగుతుంది…

Sakshitha news

అంగన్వాడీల్లో చేరితే పిల్లల మేధోశక్తి, చురుకుదనం పెరుగుతుంది…

–కార్పొరేటర్ మార్కపురి సూర్య…

పెద్దపల్లి //జిల్లా ప్రతినిధి: రామగుండం,చిన్నారులను నేరుగా పాఠశాలల్లో చేర్పించే ముందు అంగన్వాడీ కేంద్రాలకు పంపించడం ద్వారా వారి మేధోశక్తి, సృజనాత్మకత, చురుకుదనం పెరుగుతాయని సీపీఐ ఫ్లోర్ లీడర్, 41వ.డివిజన్ కార్పొరేటర్ మార్కపురి సూర్య అన్నారు.

41వ.డివిజన్ పరిధిలోని ఎల్‌బీనగర్-2, జవహర్‌నగర్ అంగన్వాడీ కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న యూనిఫాంలను చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీలో కొత్తగా చేరిన చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించారు. అలాగే “అమ్మ మాట – అంగన్వాడీ బాట” కార్యక్రమంలో భాగంగా డివిజన్‌లో ర్యాలీ నిర్వహించి మరిన్ని చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలని అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మార్కపురి సూర్య మాట్లాడుతూ, అంగన్వాడీల్లో చదివే ప్రతి చిన్నారి కూడా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో సమానంగా కనిపించేలా రాష్ట్ర ప్రభుత్వం యూనిఫాంలను అందించడం అభినందనీయమని అన్నారు. చిన్నారుల్లో సమానత్వ భావన పెంపొందించడంతో పాటు అంగన్వాడీల పట్ల ప్రత్యేక ఆకర్షణ కలిగించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఐదు సంవత్సరాల లోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అంగన్వాడీల్లో విద్యాభ్యాసం ద్వారా పిల్లల తెలివితేటలు, ఆలోచనా సామర్థ్యం, సామాజిక నైపుణ్యాలు పెరిగి భవిష్యత్తులో విద్యలో ఉన్నతంగా రాణించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

ఇప్పటికే ఎల్‌బీనగర్ అంగన్వాడీ కేంద్రం అనేక అంశాల్లో రామగుండం ప్రాంతానికి ఆదర్శంగా నిలుస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది చిన్నారులు అంగన్వాడీల్లో చేరేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ జమున, షరీన్, అంగన్వాడీ టీచర్లు జయసుధ, అరుణ, మల్లీశ్వరి, భాగ్యలక్ష్మి, ఏఎన్‌ఎం స్వరూప, ఆశా వర్కర్ సరస్వతి, చిన్నారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top