బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం

Sakshitha news

బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ లో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తాం ……….జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి

సాక్షిత వనపర్తి :
బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ భూ సేకరణకు సంబంధించి రైతుల అభిప్రాయాలను ప్రభుత్వానికి నివేదిస్తామని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు.

కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ భూ సేకరణ అంశంపై సంబంధిత గ్రామ రైతులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రిజర్వాయర్ పరిధిలోని 101 ఎకరాల భూముల రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రైతులు భూ సేకరణ అంశానికి సంబంధించి తమ అభిప్రాయాలను అధికారుల ముందు వెల్లడించారు. బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ నిర్మాణంలో సేకరించనున్న 101 ఎకరాలకు సంబంధించి తమ గ్రామానికి చెందిన 200లకు పైగా చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. తామంతా కేవలం వ్యవసాయం పైనే ఆధారపడి జీవిస్తున్నామని, భూములు కోల్పోతే తమకు ఉపాధి కోల్పోయి రోడ్డున పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు ఎకరానికి ప్రభుత్వం నిర్దేశించిన విధంగా రూ.12.50 లక్షలు కాకుండా, పెద్ద మొత్తంలో నష్టపరిహారం ఇవ్వాలని విన్నవించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఇతర ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బుద్ధారం పెద్ద చెరువు రిజర్వాయర్ భూ సేకరణలో భాగంగా భూములు కోల్పోనున్న రైతుల అభిప్రాయ సేకరణ కోసమే ఈ జిల్లాస్థాయి చర్చల కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఆయా ప్రాంతాల్లో మార్కెట్ రేట్ల కు అనుగుణంగా ధరను నిర్ణయిస్తుందని, ఈ విషయంలో రైతులు ఆమోదయోగ్యం కానీ పరిహారాన్ని కోరడం సరైన విధానం కాదని సూచించారు. రైతులకు న్యాయం చేసేందుకే ప్రభుత్వం తరఫున తాము ఎప్పుడు ప్రయత్నిస్తామని తెలిపారు. కాబట్టి రైతులు వాస్తవ పరిస్థితులను ఆధారంగా చేసుకుని తమ విన్నపాన్ని తెలియజేయాలని సూచించారు. తద్వారా తాము రైతుల విన్నపాన్ని ప్రభుత్వానికి నివేదించి న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు.

అదేవిధంగా భూములు కోల్పోయే వారికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు విషయంలో ప్రాధాన్యత ఇస్తామని, కలెక్టర్ హామీ ఇచ్చారు.

సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ తిరుపతయ్య, ఆర్డీవో సుబ్రహ్మణ్యం, ఇతర రెవెన్యూ అధికారులు, గ్రామ సర్పంచి శేఖర్ , గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top