సమాచార హక్కు చట్టం అమలులో నిర్లక్ష్యం సహించం…
ప్రతి పౌరుడికి సమాచారం తెలుసుకునే హక్కు ఉంది…
— రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:పెద్దపల్లి, సమాచార హక్కు చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని, ప్రభుత్వ శాఖలు అత్యంత ప్రాధాన్యతతో అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా.జి.చంద్రశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ), పెద్దపల్లిలో జిల్లా అధికారులకు నిర్వహించిన సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యరెడ్డి, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్లు జే అరుణశ్రీ, కొప్పుల వెంకటరెడ్డి, డిసిపి రాంరెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డా. జి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంపొందించే శక్తివంతమైన సాధనమని అన్నారు. ప్రతి భారతీయ పౌరుడికి ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని పొందే హక్కును సెక్షన్-3 కల్పిస్తుందని తెలిపారు.
తెల్ల రేషన్ కార్డు కలిగిన బీపీఎల్ కుటుంబాలకు ఆర్టీఐ దరఖాస్తులపై ఎటువంటి ఫీజు అవసరం లేదని తెలిపారు. సమాచారాన్ని అందించేందుకు అయ్యే ఖర్చు ఎంత అనేది ప్రజా సమాచార అధికారులు ముందుగానే దరఖాస్తుదారునికి తెలియజేయాలని సూచించారు. చట్టం ప్రకారం 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలని, గడువు దాటితే సమాచారాన్ని ఉచితంగా అందించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
30 రోజుల్లో సమాచారం అందకపోతే సమాచార కమిషన్కు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సమాచారం ఇవ్వకపోవడం వల్ల దరఖాస్తుదారునికి నష్టం సంభవిస్తే పరిహారం కోరే అవకాశం కూడా చట్టంలో ఉందని వివరించారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో అవసరమైతే మూడో పక్ష సమాచారాన్ని కూడా వెల్లడించవచ్చని తెలిపారు. ప్రతి కార్యాలయంలో ప్రజా సమాచార అధికారి, మొదటి అప్పీలేట్ అథారిటీ, రెండో అప్పీలేట్ అథారిటీ వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.
ఆర్టీఐ చట్టంలోని వివిధ సెక్షన్లపై అధికారులు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించాలని, శాఖలకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, సమాచార హక్కు చట్టాన్ని అత్యున్నత ప్రాధాన్యతతో అమలు చేయాలని ప్రధాన సమాచార కమిషనర్ స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ సూచించిన మార్గదర్శకాలను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు. ఆర్టీఐ చట్టం అమలులో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు.
జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన 570 మందికి పైగా ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీలేట్ అథారిటీలు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనడం సంతోషకరమని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు చట్టంపై మరింత అవగాహన పెంపొందించుకుని, దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు గంగయ్య, సురేష్, జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రజా సమాచార అధికారులు, మొదటి అప్పీలేట్ అథారిటీలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
