ఫిట్‌గా ఉంటేనే విధుల్లో సమర్థత… పోలీసుల ఆరోగ్యమే శాఖకు బలం….
వారాంత పరేడ్‌లో పోలీస్ సిబ్బందికి సీపీ అంబర్ కిషోర్ ఝా సూచనలు…
సాక్షిత పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:రామగుండం, రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్ పరేడ్ గ్రౌండ్లో అర్ముడ్ సిబ్బందికి వారాంత పరేడ్ ఘనంగా నిర్వహించారు. ఈ పరేడ్‌కు అడ్మిన్ ఆర్ఐ శేఖర్ కమాండర్‌గా వ్యవహరించగా, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం పరేడ్‌ను పరిశీలించిన సీపీ అంబర్ కిషోర్ ఝా సిబ్బందికి పలు సూచనలు చేస్తూ పోలీస్ శాఖలో విధుల నిర్వహణకు శారీరక దారుఢ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
పోలీస్ పరేడ్ అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, నిత్య విధులతో పాటు ఎన్నికల విధుల్లోనూ కష్టపడి పనిచేసిన సిబ్బందిని అభినందించారు. సుమారు వంద మంది సిబ్బంది పాల్గొని పరేడ్‌ను విజయవంతం చేశారని ప్రశంసించారు.
ఆరోగ్యం, శారీరక సామర్థ్యమే పోలీస్ ఉద్యోగంలో ప్రధాన బలమని పేర్కొన్న సీపీ, ఫిట్‌గా ఉంటేనే ఏ బాధ్యతనైనా సమర్థవంతంగా నిర్వర్తించగలమన్నారు. ఆహారపు అలవాట్లు, విశ్రాంతి, వ్యాయామం వంటి అంశాలపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని సూచించారు.
పోలీస్ సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ కోసం కమిషనరేట్ పరిధిలో తరచూ వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని, త్వరలో మరో మెగా మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వివిధ వైద్య నిపుణులను అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన ఆరోగ్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది పరేడ్‌లో చురుకుగా పాల్గొనడాన్ని అభినందించిన సీపీ, పోలీస్ యూనిఫాంలో ఉన్న ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, బాధ్యతలు, అవకాశాలు ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో మహిళా పోలీసుల కోసం ప్రత్యేక ప్లాటూన్ల ఏర్పాటు దిశగా చర్యలు పరిశీలిస్తున్నామని చెప్పారు.
సిబ్బంది మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండటం వల్ల ఫిట్నెస్, పనితీరు, టర్నౌట్ మరింత మెరుగుపడుతాయని పేర్కొన్నారు. పరేడ్‌లో కొన్ని సాంకేతిక అంశాల్లో సమన్వయం మెరుగుపర్చాల్సిన అవసరం ఉన్నప్పటికీ మొత్తం ప్రదర్శన సంతృప్తికరంగా ఉందని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐలు దామోదర్, శేఖర్, మల్లేష్, రమేష్, ఆర్ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, వెంకట్, శివ, పోచలింగం తదితర అర్ముడ్ సిబ్బంది పాల్గొన్నారు.
