ఎన్టీపీసీ యాజమాన్యం కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోవాలి…
– జేఏసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆందోళన…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:ఎన్టీపీసీ, ఎన్టీపీసీ సంస్థ అభివృద్ధిలో దశాబ్దాలుగా భాగస్వాములైన కాంట్రాక్టు కార్మికుల పట్ల యాజమాన్యం అవలంబిస్తున్న నిరంకుశ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ,జేఏసీ కాంట్రాక్టు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఎన్టీపీసీ ప్లాంట్ గేట్-2 వద్ద భారీ ధర్నా, నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్మికులు స్వచ్ఛందంగా విధులను బహిష్కరించి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
ఈ నిరసన కార్యక్రమానికి ఐఎన్టీయూసీ సీనియర్ నాయకులు బాబర్ సలీం పాషా, బిఆర్ఎస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరై కార్మికుల పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా జేఏసీ కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ, 2018లో హైదరాబాద్ లేబర్ కమిషనర్ సమక్షంలో కుదిరిన 12(3) ఒప్పందం ప్రకారం సీనియర్ కార్మికులు, ఐటీఐ అర్హత కలిగిన కార్మికులకు ప్రమోషన్ పాలసీ అమలు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒప్పందం జరిగి ఎనిమిదేళ్లు గడిచినా యాజమాన్యం స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు.
అలాగే 1990 నుంచి విధులు నిర్వహిస్తున్న కార్మికులు ఇప్పటికే పీవీసీ సర్టిఫికెట్లు సమర్పించినప్పటికీ, ప్రతిసారి కాంట్రాక్టర్ మారినప్పుడు మళ్లీ మళ్లీ పీవీసీ సమర్పించాలని ఒత్తిడి చేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ విధానం కార్మికులకు ఆర్థిక, మానసిక భారం అవుతోందని, వెంటనే ఈ నిబంధనను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మెడికల్ టెస్టుల పేరుతో కూడా కార్మికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. స్థానిక ధన్వంతరి ఆసుపత్రిలో సరైన వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులు, తగిన సిబ్బంది లేక కార్మికులు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందన్నారు. కాబట్టి ధన్వంతరి ఆసుపత్రిలోనే అన్ని రకాల వైద్య పరీక్షల సౌకర్యాలు కల్పించాలని లేదా ఈఎస్ఐ ఆసుపత్రుల ద్వారా జరిగే వైద్య పరీక్షలను అధికారికంగా గుర్తించాలని యాజమాన్యాన్ని కోరారు.
తమ న్యాయమైన మూడు ప్రధాన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ కార్మిక సంఘాల నాయకులు గిట్ల లక్ష్మారెడ్డి, చిలుక శంకర్, నాంసాని శంకర్, బి. చందర్, ఈ. భూమయ్య, ఏ. శ్రీనివాస్, సిహెచ్ సత్యం, పురుషోత్తం, దండ రాఘవరెడ్డి, టి. సత్యనారాయణ, ఎండి జమీల్, కే. మల్లేష్, కే. రాజ్‌కుమార్, టి. రవీందర్ తదితర నాయకులు, కాంట్రాక్టు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
