జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి అండగా వెలుగు సంస్థ – మూడు సంవత్సరాల పాటు ఆర్థిక సహాయం…
సాక్షిత : తండ్రి జ్ఞాపకార్థం విద్యార్థి చదువుకు సహకారం అందిస్తున్న సిహెచ్ కిషోర్…
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సప్తగిరి కాలనీలో నివాసముంటున్న సిరివేన అక్షయ అనే జీఎన్‌ఎమ్ నర్సింగ్ విద్యార్థినికి వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
గోదావరిఖని మేదర్ బస్తికి చెందిన చంద్రశేఖర్ కిరాణా మర్చంట్ నిర్వాహకులు సిహెచ్ కిషోర్ తన తండ్రి సిహెచ్ చంద్రశేఖర్ జ్ఞాపకార్థం విద్యార్థిని మూడు సంవత్సరాల కోర్సు పూర్తి చేసే వరకు ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.1000 ఆర్థిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో వెలుగు సామాజిక స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ అండ్ చైర్మన్ డా. సురభి శ్రీధర్, సంస్థ సలహాదారులు డా. లయన్ కె. రాజేందర్, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వేముల రమేష్, సంస్థ బాధ్యులు కొమ్ము రాజు పాల్గొని విద్యార్థినికి సహాయం అందించారు.
ఈ సందర్భంగా డా. లయన్ కె. రాజేందర్ మాట్లాడుతూ వెలుగు సంస్థ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగానే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థినికి సహాయం అందించడం అభినందనీయమన్నారు. మూడు సంవత్సరాల పాటు ప్రతినెలా రూ.1000 చొప్పున విద్యార్థి ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు.
డా. సురభి శ్రీధర్ మాట్లాడుతూ విద్యార్థిని చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి ప్రస్తుతం అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోందని తెలిపారు. అమ్మమ్మ కూలి పని చేస్తూ ఆమెను చదివిస్తోందన్నారు. విద్యార్థిని చదువు కోసం తమ సంస్థను సంప్రదించగా సిహెచ్ కిషోర్ ముందుకు వచ్చి సహాయం చేయడానికి అంగీకరించారని తెలిపారు.
విద్యార్థిని చదువు పూర్తయ్యే వరకు ఆర్థిక సహాయం అందించనున్న కిషోర్‌కు సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేఏజేటీఎస్ రామగుండం సంస్థ నిర్వాహకులు కే. లావణ్య, ఏ. రవితేజ, ఎన్. రామకృష్ణ, ఏ. తిరుమల, కే. జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
