అంతర్జాతీయ స్థాయికి సింగరేణిని తీసుకెళ్లడమే తెలంగాణకు నిజమైన గౌరవం….
తెలంగాణ గౌరవాన్ని మరింత పెంచే దిశగా సింగరేణి అడుగులు…
—సీఎండీ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన సింగరేణి సంస్థను అంతర్జాతీయ స్థాయికి చేర్చడమే రాష్ట్రానికి మనం అందించే నిజమైన గౌరవమని సింగరేణి సంస్థ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్దప్రకాష్ జ్యోతి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనేక మంది యువకులు, నాయకులు చేసిన త్యాగాల ఫలితంగానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, రాష్ట్ర అవతరణ తర్వాత అనేక రంగాల్లో అభివృద్ధి సాధించి యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని ఆయన తెలిపారు. సింగరేణి సంస్థ తెలంగాణకే కాకుండా ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరిస్తోందని, భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే దిశగా ప్రతి ఉద్యోగి అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
పోటీ మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఓపెన్‌కాస్ట్, భూగర్భ గనుల్లో యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించి ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలని, బొగ్గు నాణ్యతను మరింత మెరుగుపరచాలని సూచించారు. ప్రతి ఉద్యోగి తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తే సంస్థ మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు.
వేడుకలకు ముందు తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్థూపం, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఉత్తమ సేవలందించిన ఎల్. శ్రీనివాస్ (ఏజీఎం పర్చేస్), వై. లక్ష్మీనారాయణ (ఎంవీ డ్రైవర్), డి. రుద్రమ్మ (ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి)లను ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలో డైరెక్టర్ (పర్సనల్ మరియు ఫైనాన్స్) గౌతమ్ పోట్రు, జనరల్ మేనేజర్ (కోఆర్డినేషన్, మార్కెటింగ్) టి. శ్రీనివాస్‌తో పాటు పలువురు అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
