రాష్ట్ర అవతరణ వేడుకలకు పెద్దపల్లి సిద్ధం

Sakshitha news

రాష్ట్ర అవతరణ వేడుకలకు పెద్దపల్లి సిద్ధం
ఘనంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి….

–జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష….
పెద్దపల్లి// జిల్లా ప్రతినిధి:
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పెద్దపల్లి జిల్లాలో వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు.

సమీకృత జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరుగనున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

జూన్ 2న నిర్వహించే వేడుకలకు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ఉదయం 7.45 గంటలకు ముఖ్య అతిథి కలెక్టరేట్‌కు చేరుకుంటారని, 7.50 గంటలకు గౌరవ వందనం, 7.51 నుంచి 7.58 గంటల వరకు అమరవీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఉంటుందని చెప్పారు.
ఉదయం 8 గంటలకు జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన, తెలంగాణ గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం పరేడ్, ముఖ్య అతిథి సందేశం, ప్రశంసా పత్రాల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

అవతరణ దినోత్సవ వేడుకలను విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సౌండ్ సిస్టమ్, విద్యుత్ సరఫరా, వేదిక, టెంట్లు, బ్యారికేడ్లు తదితర ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రామ్‌రెడ్డి, జిల్లా పౌర సరఫరాల అధికారులు శ్రీనాథ్, శ్రీకాంత్, పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి. గంగయ్య, మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, తహసీల్దార్ రాజయ్య, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Scroll to Top