రూ.4.18 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం…
రామగుండాన్ని విద్య, ఉపాధి కేంద్రంగా.. ఆదర్శ నివాస నగరంగా తీర్చిదిద్దుతాం…
సీసీ, బీటీ రోడ్లు, వర్షపు నీటి కాలువలు, ప్రహరీ గోడల నిర్మాణ పనులకు శంకుస్థాపన…
—ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:రామగుండం,
రామగుండం నగరాన్ని ఆధునిక మౌలిక సదుపాయాలతో కూడిన నివాసయోగ్యమైన నగరంగా, విద్యా మరియు ఉపాధి అవకాశాల కేంద్రంగా ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ తెలిపారు. జిల్లా ఖనిజ అభివృద్ధి నిధి (డీఎంఎఫ్‌టీ) నుంచి రూ.4.18 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు బుధవారం టీచర్స్ కాలనీలో మేయర్ మహంకాళి స్వామితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ నిధులతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ, 2వ డివిజన్లలో సీసీ, బీటీ రోడ్ల నిర్మాణం, 48వ డివిజన్‌లో వర్షపు నీటి కాలువ నిర్మాణం, 49వ డివిజన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో ప్రహరీ గోడల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రస్తుతం నగరంలో రూ.800 కోట్ల విలువైన అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అదనంగా మరో రూ.400 కోట్ల నిధుల మంజూరుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నగరంలోని ప్రతి కాలనీ, ప్రతి వీధికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.
ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించేందుకు త్వరలో ఎనిమిది కొత్త నీటి ట్యాంకులను నిర్మించి నగరమంతటా 24 గంటల తాగునీటి సరఫరా వ్యవస్థను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. చివరి ఇంటి వరకు రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, మంచినీటి సదుపాయం, వీధి దీపాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
నిధుల కొరతతో మధ్యలో నిలిచిపోయిన కోర్టు భవన నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించి పూర్తి చేయించేందుకు అవసరమైన నిధులు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. ఆధునిక సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు.
ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను పూర్తిస్థాయిలో తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. నగరాభివృద్ధిలో భాగంగా అందుబాటులో ఉన్న స్థలంలో త్వరలో హరిత హోటల్ నిర్మాణానికి చర్యలు చేపడతామని వెల్లడించారు.
మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, ఎమ్మెల్యే సూచనల మేరకు టీచర్స్ కాలనీలో వర్షాకాలంలో వరద ముప్పు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. కాలువలను కుదించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. గతంలో ద్విచక్ర వాహనం వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఎదురైన టీచర్స్ కాలనీ, కేసీఆర్ కాలనీ, ఆర్టీసీ కాలనీలలో నాణ్యమైన రోడ్లు నిర్మించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు), నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ, కార్పొరేటర్లు రేణికుంట్ల నిర్మల, సాగి సంతోష్‌రావు, వెంగళ బాపు, బాలసాని తిరుపతి, దాసరి సాంబమూర్తి, బదావత్ నర్సమ్మ, భాగ్యలక్ష్మి, సత్యప్రసాద్, ఎస్‌ఈ గురువీర్‌తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.

