వరి ధాన్యం ట్రాన్స్పోర్ట్ కోసం లారీలను అదనంగా సమకూర్చాలని కాంట్రాక్టర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
రైతులు చెల్లించిన రవాణా ఖర్చులను కాంట్రాక్టర్ ద్వారా రైతులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేసిన కలెక్టర్
సాక్షిత వనపర్తి :
మిల్లుల వద్ద వరి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతం కావాలని, కావాలంటే హమాలి కార్మికులను అదనంగా రప్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ పెద్దమందడి మండల పరిధిలోని సప్తగిరి మరియు శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను సందర్శించి ఆయా ప్రదేశాల్లో వరి ధాన్యం నిల్వల కోసం జరుగుతున్న అన్లోడింగ్ ప్రక్రియను అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ తో కలిసి పరిశీలించారు.
ఆయా రైస్ మిల్లర్లతో మాట్లాడిన కలెక్టర్ వరి అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇందుకోసం మరింతమంది కూలీలను ఏర్పాటు చేసుకొని, లారీలను ఎక్కువసేపు నిలిపివేయకుండా వెంటనే అన్‌లోడ్ చేయాలని సూచించారు. గోదాముల్లో వరిని భద్రంగా నిల్వ చేయాలని తెలిపారు.
శ్రీ భవాని శంకర ఇండస్ట్రీస్ వద్ద మిల్లర్‌తో మాట్లాడిన కలెక్టర్ అదనపు నిల్వ స్థలాన్ని తక్షణమే సిద్ధం చేయాలని సూచించారు. తద్వారా మరింత వరి మిల్లుకు చేరే అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు వరిని తరలించేందుకు తమ ప్రైవేట్ లారీలను కూడా వినియోగించాలని ఆదేశించారు.
అదేవిధంగా వరి ధాన్యం నిల్వల కోసం అదనపు స్థలాలను గుర్తించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఐకెపి వరి ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన
కలెక్టర్ పెద్దమందడి మండల కేంద్రంలోని ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఇప్పటివరకు ఎన్ని వరి సంచులు తరలించారో, ఇంకా ఎన్ని సంచులు కొనుగోలు చేయాల్సి ఉందో ఇన్చార్జిలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రైతులు కలెక్టర్‌ను కలిసి లారీల కొరత తీవ్రంగా ఉందని, వరిని మిల్లులకు తరలించేందుకు అదనపు లారీలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రవాణా ఖర్చులను తామే భరిస్తున్నామని రైతులు తెలిపారు. దీనిపై స్పందించిన కలెక్టర్ లారీ రవాణా కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే మరిన్ని లారీలను కొనుగోలు కేంద్రాలకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అలాగే రైతులు చెల్లించిన రవాణా ఖర్చులను కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసి రైతులకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా పౌరసరఫరాల అధికారి కాశీ విశ్వనాథ్, తహసిల్దార్ పాండు నాయక్, ఇతర అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

