మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్…

Sakshitha news

మున్సిపల్ కార్మికుల డిమాండ్లకు గ్రీన్ సిగ్నల్…

మల్లమ్మ కుటుంబానికి ఉద్యోగం.. కార్మిక సంక్షేమంపై కీలక నిర్ణయాలు…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం,
ఇటీవల వడదెబ్బ కారణంగా మృతి చెందిన మున్సిపల్ పారిశుధ్య కార్మికురాలు మల్లమ్మ కుటుంబానికి న్యాయం జరిగేలా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. మల్లమ్మ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు ప్రభుత్వ పరంగా రావాల్సిన అన్ని ప్రయోజనాలను అందించేందుకు అంగీకారం కుదిరిందని వెల్లడించారు.

నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ జే. అరుణ శ్రీతో జేఏసీ నాయకులు నిర్వహించిన చర్చలు సానుకూలంగా ముగిశాయని తెలిపారు. ఈ సమావేశంలో కార్మిక సంఘాలు ప్రతిపాదించిన పలు డిమాండ్లను అధికారులు ఆమోదించినట్లు పేర్కొన్నారు.

గతంలో మృతి చెందిన, పదవీ విరమణ పొందిన కార్మికుల కుటుంబాలకు వారసత్వ ఉద్యోగాలు కల్పించేందుకు కూడా సూత్రప్రాయంగా అంగీకారం కుదిరిందన్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పారిశుధ్య కార్మికుల పనివేళలను ఉదయం 4 గంటల నుంచి 10 గంటల వరకు పరిమితం చేయాలని చేసిన విజ్ఞప్తిని అధికారులు అంగీకరించినట్లు తెలిపారు.

కార్మికులకు తాగునీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించాలని కోరగా బుధవారం నుంచి అమలు చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఆదివారం, పండుగల సెలవులను అమలు చేయడంతో పాటు పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులకు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న యూనిఫాంలు, సబ్బులు, నూనె, చెప్పులు, బెల్లం, చీపుర్లు, గౌజులు, మాస్కులు తదితర సామగ్రిని మూడు రోజుల్లో పంపిణీ చేయడానికి అంగీకారం కుదిరిందన్నారు.

రిక్షా కార్మికులు ఇంటింటికి తిరిగి డబ్బులు వసూలు చేసే విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ కార్మికుల మాదిరిగానే నేరుగా వేతనాలు చెల్లించాలని చేసిన డిమాండ్‌పై కౌన్సిల్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపినట్లు వెల్లడించారు.

గత కమిషనర్ మంజూరు చేసిన పదోన్నతులను కొనసాగించడంతో పాటు నూతన సొసైటీ ఏర్పాటు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా నష్టపోయిన మస్టర్లను పునరుద్ధరించేందుకు కూడా కమిషనర్ అంగీకరించినట్లు జేఏసీ నాయకులు తెలిపారు.

ఈ చర్చల్లో జేఏసీ నాయకులు వేల్పుల కుమారస్వామి, నడిపెల్లి మురళీధర్ రావు, ఎంఏ గౌస్, కిషన్ నాయక్, గుంజ రమణ, వేల్పుల రాయమల్లు, రాజేందర్‌తో పాటు పలువురు మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.

Scroll to Top