గంజాయి నియంత్రణకు ప్రత్యేక చర్యలు ప్రజలకు మరింత చేరువగా పోలీసు సేవలు….
— సీపీ అంబర్ కిషోర్ ఝా…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంచిర్యాల,
ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడం, గంజాయి నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను ఆదేశించారు.
వార్షిక తనిఖీలలో భాగంగా మంచిర్యాల జోన్ పరిధిలోని తాళ్లగురిజాల పోలీస్ స్టేషన్‌ను సీపీ సందర్శించి తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సీపీకి అధికారులు మొక్కలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
తదుపరి పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ విభాగం, సిబ్బంది పనితీరును పరిశీలించిన సీపీ స్టేషన్ నిర్వహణకు సంబంధించిన రికార్డులు, రౌడీషీటర్లు, అనుమానితుల వివరాలు, పెండింగ్ కేసుల నమోదును పరిశీలించారు. అలాగే సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో గంజాయి నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవల అంశాలపై చర్చించారు. పాత కేసుల దర్యాప్తు పురోగతిని సమీక్షించి, ముఖ్యంగా హత్య కేసుల దర్యాప్తు పూర్తి చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొన్నారు.
పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా, గౌరవంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. బాధితుల సమస్యలను సానుభూతితో విని వెంటనే స్పందించాలని ఆదేశించారు. విధి సమయంలో అధికారులు తప్పనిసరిగా స్టేషన్‌లో అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు.
జీరో ఎఫ్‌ఐఆర్‌తో పాటు “ఆన్ ది స్పాట్ ఎఫ్‌ఐఆర్” విధానాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నామని సీపీ తెలిపారు. కొన్ని రకాల నేరాల్లో బాధితులు పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేకుండా సంఘటన స్థలానికే వెళ్లి ఫిర్యాదు స్వీకరించి కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 80 నుంచి 90 శాతం కేసుల్లో ఈ విధానం అమలవుతోందని వెల్లడించారు.
హైవే ప్రాంతాలు, వేగంగా అభివృద్ధి చెందుతున్న బస్తీల్లో ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భూ వివాదాల్లో చట్టపరమైన విధానాలను మాత్రమే అనుసరించాలని ఆదేశించారు.
పోలీస్ స్టేషన్ నిర్వహణ, క్రమశిక్షణ, పరిశుభ్రత, నేర కేసుల దర్యాప్తులో సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని సీపీ అభినందించారు.
ఈ తనిఖీల్లో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, తాళ్లగురిజాల ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

