గుడుంబాపై పోలీసుల ఉక్కుపాదం లింగాపూర్‌లో 25 లీటర్ల గుడుంబా స్వాధీనం–1200 లీటర్ల బెల్లం వాష్ ధ్వంసం…

Sakshitha news

గుడుంబాపై పోలీసుల ఉక్కుపాదం లింగాపూర్‌లో 25 లీటర్ల గుడుంబా స్వాధీనం–1200 లీటర్ల బెల్లం వాష్ ధ్వంసం…

సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: మంచిర్యాల,
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ సర్కిల్ లింగాపూర్ గ్రామంలో పోలీసులు నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో అక్రమ గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపారు. బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్, తాళ్లగురిజాల ఎస్‌ఐ రామకృష్ణ ఆధ్వర్యంలో మంగళవారం తెల్లవారుజామున ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా భుక్యా రంజిత్ వద్ద నుంచి 20 లీటర్ల గుడుంబా, బానోత్ వాగేష్ వద్ద నుంచి 5 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 1200 లీటర్ల బెల్లం వాష్‌ను గుర్తించి ధ్వంసం చేశారు.

గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో 30 మోటార్‌సైకిళ్లు, 5 ఆటోలు, 4 ట్రాలీల పత్రాలను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో బెల్లంపల్లి రూరల్ సీఐ హనుక్ మాట్లాడుతూ అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు. ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గుడుంబా తయారీ లేదా విక్రయంలో ఎవరైనా పాల్గొన్నట్లు గుర్తిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అక్రమ మద్యం తయారీ, వినియోగానికి దూరంగా ఉండాలని, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని కోరారు.

అదేవిధంగా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి టూ టౌన్ ఎస్‌ఐ కిరణ్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ సిబ్బంది పాల్గొన్నారు.

Scroll to Top