పెద్దంపేట రచ్చగుట్టను కాపాడాలి – తవ్వకాల అనుమతులు వెంటనే రద్దు చేయాలి……
–సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: పెద్దంపేట,
అంతర్గాం మండలం పెద్దంపేట గ్రామంలోని చారిత్రక, ప్రకృతి వారసత్వ సంపద అయిన రచ్చగుట్టను పరిరక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పెద్దంపేట గ్రామంలో నిర్వహించిన జిల్లా ముఖ్య సమావేశంలో పార్టీ పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గాం మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు అడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య మాట్లాడుతూ.. రచ్చగుట్టలో అక్రమంగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
రైల్వే, రహదారి పనుల పేరుతో గ్రామ చారిత్రక నేపథ్యం కలిగిన రచ్చగుట్టను కనుమరుగు చేసేందుకు కొందరు రాజకీయ నాయకులు, అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రచ్చగుట్టను కాపాడేందుకు అధికార పార్టీ, గ్రామ పాలకవర్గం చేసిన ప్రకటనలను స్వాగతిస్తున్నామని, అయితే అవి మాటలకే పరిమితం కాకుండా తవ్వకాలను పూర్తిగా నిలిపివేసేలా చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని కోరారు.
గ్రామ పాలకవర్గం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పటికీ నేటికీ మట్టి తవ్వకాలు కొనసాగడం అనుమానాలకు తావిస్తోందన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో కాలుష్యం పెరిగి ప్రజల జీవన విధానంపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. రచ్చగుట్టను తవ్వకాల కోసం వినియోగించకుండా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోరాట వారసత్వం కలిగిన పెద్దంపేట గ్రామ ప్రజలంతా రచ్చగుట్ట పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో గూడూరు వైకుంఠం, తూల్ల శంకర్, మాజీ సర్పంచ్ మార్త రాధ, కోడిపుంజుల లక్ష్మి, బుర్ర బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.

