వనపర్తి డిఎస్ఓ అక్రమాల వల్ల ప్రభుత్వం ఆప్రతిష్టపాలు

Sakshitha news

వనపర్తి డిఎస్ఓ అక్రమాల వల్ల ప్రభుత్వం ఆప్రతిష్టపాలు

అవినీతి డీఎస్ఓను వెనుకేసుకురావడంలో కలెక్టర్ ఆంతర్యం ఏమిటి..?

రూ.9 కోట్లకు పైగా ధాన్యం మాయంపై కస్టోడియన్ పై చర్యలు తీసుకోరా..?

సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే రైతులు హరిగోస

ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే రైతుల సమస్య జటిలం

ఏసీబీ, విజిలెన్స్, టాస్క్ ఫోర్స్ అధికారులు డిఎస్ఓపై తక్షణమే విచారణ చేపట్టాలి

—బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్

సాక్షిత వనపర్తి :
వనపర్తి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అవినీతి, అక్రమాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రతిష్టపాలు అవుతుందని బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ మండిపడ్డారు.

సోమవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…. వనపర్తి జిల్లాలో సివిల్ సప్లయ్ అధికారులు ధాన్యం కొనుగోలులలో పూర్తిగా విఫలమయ్యారని, అందుకు ప్రధాన కారణం డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ అని ఆరోపించారు.

రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎక్కడ దించుకోవాలో తెలియని అయోమయ స్థితిలో జిల్లా సివిల్ సప్లయ్ అధికారులు ఉన్నారని, ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతోనే రైతుల సమస్య జటిలమవుతుందని అన్నారు.

జిల్లావ్యాప్తంగా 2 లక్షల 70 వేల నుంచి 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు పండిస్తున్నారనే ముందస్తు నివేదిక ఉన్నప్పటికీ అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయడంలో వనపర్తి డిఎస్ఓ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించాలని విమర్శించారు.

ఇటీవలే టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలో రెండు రైస్ మిల్లులపై తనిఖీలు జరపగా వాటిలో రూ.9 కోట్లకు పైగా ధాన్యం మాయమైనట్లు గుర్తించడం జరిగిందన్నారు. ధాన్యం మాయం చేసిన మిల్లులను సీజ్ చేసి కేసులు నమోదు చేశారే కానీ అందుకు బాధ్యుడైన కస్టోడియన్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

పూర్తిగా అవినీతి, అక్రమాలలో కూరుకుపోయిన వనపర్తి డిఎస్ఓ కాశీ విశ్వనాథ్ ను జిల్లా కలెక్టర్ ఎందుకు వెనకేసుకొస్తున్నాడో జిల్లా ప్రజలకు అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.

ఈ పరిణామాలపై ఏసీబీ అధికారులు, విజిలెన్స్ మరియు టాస్క్ ఫోర్స్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేసి డిఎస్ఓపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

జిల్లాలో జరుగుతున్న అవినీతి, అక్రమాల వెనుక డీఎస్ఓ హస్తం ఉందని, అందుకు తగిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. సీజ్ చేసిన మిల్లులో మిల్లింగ్ ఎలా చేస్తారని, దీనంతటికి కారణం డీఎస్ఓ కాశి విశ్వనాధ్ కాదా? అని నిలదీశారు.

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని ప్రయత్నాలు చేస్తుంటే డీఎస్ఓ చేస్తున్న నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటీవలే సమీక్ష నిర్వహించి డిఎస్ఓను సస్పెండ్ చేయాలని ఆదేశించినప్పటికీ కలెక్టర్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో వివరించాలన్నారు.

అంతేకాకుండా జిల్లాలో ఓ ఉన్నతాధికారికి సంబంధించిన కుటుంబ సభ్యులు అడ్డాకుల టోల్ గేట్ దగ్గరికి వచ్చి ముడుపులు తీసుకు వెళుతున్నట్లుగా తమ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు.

సిబిఐ, ఏసీబీ, విజిలెన్స్ అధికారులను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని, అదేవిధంగా త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై ఫిర్యాదు చేస్తామన్నారు.

గతంలో ఉన్న కలెక్టర్లు జిల్లా అభివృద్ధికి పాటు పడ్డారని, ప్రస్తుతం ఉన్న జిల్లా కలెక్టర్ ఎన్ని ఫిర్యాదులు చేసిన ఏమాత్రం పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పందించి అవినీతి డీఎస్ఓపై తక్షణ చర్యలు తీసుకొని, జిల్లా అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో జెఎసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోటూరి రవీందర్ గౌడ్,ఉపాధ్యక్షులు రేనట్ల మల్లేష్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు శ్రీధర్, రఘు తదితరులు పాల్గొన్నారు

Scroll to Top