మహిళా శక్తి సొంత భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు …………జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి
సాక్షిత వనపర్తి :
వనపర్తి జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద 104 మహిళా శక్తి స్వంత భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, అన్నింటిని డిసెంబర్ లోపు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మే, 25 నుండి 30 వరకు జరుగనున్న మహిళా శక్తి వారోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని అన్ని జిల్లాల మహిళా సమాఖ్య సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఒకేసారి రాష్ట్రంలోని 8000 మహిళా శక్తి స్వంత భవనాలకు వర్చువల్ గా భూమి పూజ నిర్వహించారు. అదేవిధంగా డిసెంబర్ నాటికి రాష్ట్రంలోని కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేసే విధంగా చిలకపచ్చ రంగు చీరను ఆమోదించి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తేనే రాష్ట్రం ఆర్థికాభివృద్ధి సాధిస్తుంది అన్నారు. అందుకే ఈరోజు కొన్ని జిల్లాల్లో సోలార్ ప్లాంట్ లను, పెట్రోల్ బంక్ లు, మహిళా శక్తి భవనాలు, ఆర్టీసీ బస్సులను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగిందన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం పూర్తి సహాయ సహకారం అందిస్తుందని, మహిళలు సద్వినియోగం చేసుకొని ప్రతి మండలంలో గోదాములు నిర్మించుకోవడం, రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకోవడం, అన్ని జిల్లాల్లో పెట్రోల్ బంక్ లు, సోలార్ ప్లాంట్ , సూపర్ మార్కెట్, లాజిస్టిక్ హబ్ లు నిర్మించుకోవాలని సూచించారు. 2034 నాటికి కోటి మంది మహిళలు కోటీశ్వరులు కావాలని ఆకాంక్షించారు.
జిల్లాలోని మహిళా సమాఖ్య సభ్యులతో వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో 356 మహిళా సంఘాలు ఉన్నాయని వాటిలో 91 మహిళా సంఘాలకు స్వంత భవనాలు ఉన్నట్లు తెలిపారు. ఉపాధి హామీ ద్వారా ఇప్పుడు 104 స్వంత భవనాలు మంజూరు అయ్యాయని, మరో 55 భవనాలు మంజూరు కొరకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలియజేశారు. మిగిలిన 94 సంఘాలకు స్థల పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. 104 మహిళా సంఘాల భవనాలు త్వరగా పనులు ప్రారంభించి డిసెంబర్ లోపు పూర్తి చేసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో మహిళా సంఘాల మొండి బకాయిలు కేవలం ఒక శాతం మాత్రమే ఉందని, అదికూడా త్వరలో చెల్లించి జీరో ఎన్.పి.ఎ గా జిల్లాను తీర్చిదిద్దుతామని తెలియజేశారు.
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, పి.డి. డిఆర్డిఓ ఉమాదేవి , మహిళా సంఘాల మండల అధ్యక్షులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

