కార్మికులకు భారీ వరం – జూన్ 1 నుంచి పెరిగిన కనీస వేతనాలు అమలు….
1.11 కోట్ల మంది కార్మికులకు లబ్ధి – తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: హైదరాబాద్,
తెలంగాణ రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలను పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. పెంచిన వేతనాలు జూన్ 1, 2026 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక ఉపాధి శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఈ కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రులు, ప్రభుత్వ విప్ మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రంలోని కార్మికులను అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా నాలుగు విభాగాలుగా విభజించి వేతనాల పెంపు చేపట్టినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అలాగే గతంలో ఉన్న అర్బన్, రూరల్ రెండు జోన్ల స్థానంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల ఆధారంగా మూడు జోన్లుగా విభజించి కనీస వేతనాలను నిర్ణయించినట్లు చెప్పారు.
పెరిగిన కనీస వేతనాల ప్రకారం అన్‌స్కిల్డ్ కార్మికులకు ₹12,750 నుంచి ₹16,000కు, సెమీ స్కిల్డ్ కార్మికులకు ₹13,592 నుంచి ₹17,000కు, స్కిల్డ్ కార్మికులకు ₹13,772 నుంచి ₹18,500కు, హైలీ స్కిల్డ్ కార్మికులకు ₹14,607 నుంచి ₹20,000కు పెంచినట్లు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా కార్మికుల సంక్షేమం కోసం ఈ స్థాయిలో వేతన సవరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఇంటి అద్దెల భారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కార్మిక సంఘాలు, యాజమాన్యాలు, ఇతర భాగస్వామ్యులతో విస్తృతంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
విదేశాల్లో నైపుణ్యం కలిగిన కార్మికులకు అధిక డిమాండ్ ఉందని, ముఖ్యంగా గల్ఫ్ మరియు పశ్చిమాసియా దేశాలకు వెళ్లే కార్మికులకు ప్రత్యేక శిక్షణ అందించి, అక్కడి కంపెనీల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు మధ్యవర్తుల మోసాలకు గురికాకుండా ప్రభుత్వం అన్ని విధాల రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేశారు.
అలాగే గల్ఫ్ దేశాల్లో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి గుర్తు చేశారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.11 కోట్ల మంది కార్మికుల జీవనోపాధి మెరుగుపడటంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

